సూర్యాపేట: భర్తను చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. అవకాశం కోసం ఎదురుచూసిన భార్య భర్త నిద్రిస్తుండగా ప్రియుడికి ఫోన్ చేసింది. అంతగా మోజు పడిన ప్రియుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి కట్టుకున్న భర్తను తానే స్వయంగా చంపింది. భర్త మెడకు చున్నీ బిగించి.. ఊపిరాడకుండా చేసి హతమార్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ అనే గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కందిబండకు చెందిన ముత్యాలు(28), నాగరాణికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక బాబు, పాప ఉన్నారు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లు భర్తతో బాగానే ఉన్న నాగరాణి ఆ తర్వాత భర్తకు క్రమక్రమంగా దూరమైంది. నాగమణికి నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ముత్యాలుకు తెలియకుండా కలుసుకునే వారు. భర్త కళ్లు గప్పి చాటుమాటుగా సాగించడం కష్టమని భావించిన నాగమణి, ఆమె ప్రియుడు ముత్యాలును చంపాలని భావించారు. భర్త హత్యకు నాగమణే వ్యూహం పన్నింది. తన భర్త నిద్రించాక ఫోన్ చేస్తానని, వెంటనే రావాలని ప్రియుడు నవీన్‌కు చెప్పింది. ఇద్దరూ జూన్ 7న ముత్యాలును హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా ప్రియుడి మోజులో పడిపోయిన నాగమణి కట్టుకున్న భర్త గురించి క్షణం కూడా ఆలోచించలేదు.
క్షణిక సుఖాల కోసం తాళి కట్టిన భర్తనే చంపాలనుకుంది. ఆరోజు రానే వచ్చింది. ముత్యాలు తిన్న తర్వాత ఇంట్లో పడుకుని నిద్రిస్తున్నాడు. నిద్రపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతనిని చంపేందుకు ఇదే సరైన సమయమని నాగమణి భావించింది. తన ప్రియుడు నవీన్‌కు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నవీన్ ఫోన్ ఎత్తకపోయేసరికి భర్తను తానే స్వయంగా చంపింది. చున్నీని బిగించి.. ఊపిరాడకుండా చేసి ముత్యాలును చంపేసింది. ఈ విషయాన్ని పోలీసుల ఎదుట అంగీకరించింది. దీంతో.. ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తన భర్తది సహజ మరణమని నాగమణి అందరినీ నమ్మించింది.
అంత్యక్రియలు కూడా మృతిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండానే జరిగాయి. కానీ.. ముత్యాలు సోదరుడు వెంకటేశ్వర్లుకి అనుమానం కలిగింది. దీంతో.. ముత్యాలు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో నాగమణిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extramarital affairs, Husband killed by wife, Nalgonda, Suryapet, Telangana crime news