ఘజియాబాద్: ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు మగాళ్ల బలహీనతలను క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక మహిళ, ఆమె భర్త కలిసి ఇదే పని చేసి అడ్డంగా దొరికిపోయారు. సైబర్ క్రైం పోలీసులు ఆ భార్యాభర్తలతో పాటు వాళ్లకు ఈ దందాలో సహకరిస్తున్న మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన యోగేష్ గౌతమ్, సప్నా గౌతమ్ భార్యాభర్తలు.
ఈ జంట కష్టపడకుండా డబ్బు సంపాదించడం కోసం నీచానికి దిగజారారు. ఇంటర్నెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన మగాళ్లకు వలపు వల విసిరి, వారితో సెల్ఫోన్లో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడి.. ఆ వీడియోలను వాళ్లకు తెలియకుండా రికార్డ్ చేసి సప్న, యోగేష్ బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించేవాళ్లు. మగాళ్లను రెచ్చగొట్టి వాళ్లతో న్యూడ్ కాల్స్ మాట్లాడి ట్రాప్ చేయడం సప్న పని కాగా, అలా వీళ్ల వలలో చిక్కుకున్న మగాళ్లను బెదిరించి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం సప్న భర్త యోగేష్ పనిగా పెట్టుకున్నారు. ఇలా కొన్ని వందల మందిని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలను దండుకున్నారు.
ఈ భార్యాభర్తలు ఈ దందాలో మరో ముగ్గురిని పార్ట్‌నర్స్‌గా చేసుకుని గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. వీళ్ల వలలో చిక్కుకున్న మగాళ్లెవరూ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇన్నాళ్లూ వీళ్ల ఆటలు సాగాయి. కానీ.. ఈ గ్యాంగ్ ట్రాప్‌లో చిక్కుకుని రాజ్‌కోట్‌కు చెందిన తుషార్ అనే వ్యక్తి రూ.80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించడంతో ఈ చీకటి దందా వెలుగులోకొచ్చింది. సైబర్ క్రైం పోలీసులు తుషార్ ఇచ్చిన సమాచారంతో సప్న, యోగేష్‌లను అరెస్ట్ చేసి విచారించగా ఈ దందా నిజమేనని తేలింది. పోలీసులు ఈ గ్యాంగ్ వద్ద కొన్ని పోర్న్ వీడియోలు, అభ్యంతర వస్తువులు, ల్యాప్టాప్స్, సెల్‌ఫోన్స్, అశ్లీల దృశ్యాల సీడీలు, మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్స్, సెక్స్ టాయ్స్, 8 వేల డబ్బు, సిల్వర్ జువెలరీ, 8 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నట్లు గుర్తించారు. నాసిక్, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ గ్యాంగ్ చీకటి దందాకు తెరలేపినట్లు తెలిసింది.
ఈ కేసు గురించి ఘజియాబాద్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌లో సప్న ప్రధాన నిందితురాలని, కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసి భారీగా డబ్బు పొందారని.. అప్పటి నుంచి ఇదే పని చేస్తూ పలువురిని మోసం చేశారని చెప్పారు. రెండేళ్లుగా సప్న, యోగేష్ ఈ గ్యాంగ్‌ను నడుపుతున్నారని తెలిపారు. అభ్యంతకర రీతిలో వాయిస్ కాల్స్ మాట్లాడి రెచ్చగొట్టడం, ఆ తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ చేసి అవతలి వ్యక్తి వీడియోలను రికార్డ్ చేసి బెదిరించడం పనిగా పెట్టుకున్నారని.. ఉద్యోగం పేరుతో మరో ముగ్గురు యువతులను కూడా ఈ రొంపిలోకి దింపి వాళ్లతో కూడా సప్న ఇదే పని చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ దందాలో వీళ్లు బ్లాక్మెయిల్ చేయడం ద్వారా రూ.4 కోట్లు దండుకున్నట్లు బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా తెలిసిందని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. వీళ్ల చేతిలో మోసపోయిన వారెవరూ పరువు పోతుందని ఫిర్యాదు చేయకపోవడంతో రెండేళ్లుగా ఈ గ్యాంగ్ ఆటలు సాగాయని, ఎట్టకేలకు రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ ఆట కట్టించినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband, Uttar pradesh, Wife, Wife and husband