గోవిందుడి కిరీటాలను మాయం చేసిందెవరు? కొనసాగుతున్న దర్యాప్తు

తిరుమల వెంకటేశ్వరుడికి అన్నగా పేర్కొనబడే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో స్వర్ణ కిరీటాల మాయంపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ ప్రకాశ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. తనిఖీలు చేపట్టారు.

news18-telugu
Updated: February 3, 2019, 10:12 PM IST
గోవిందుడి కిరీటాలను మాయం చేసిందెవరు? కొనసాగుతున్న దర్యాప్తు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తిరుమల కొండపై వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులంతా.. తిరుపతిలో కొలువైన గోవింద రాజస్వామిని కూడా దర్శించుకుంటారు. అందుకే ఆ ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. అలాంటి వాతావరణంలో గోవిందునికి అలంకరించే మూడు స్వర్ణ కిరీటాలు మాయం కావడం సంచలనం రేపింది. దాదాపు 1351 గ్రాముల బరువున్న 3 స్వర్ణ కిరీటాలు దొంగతనానికి గురైనట్టు నిర్ధారించిన ఆలయ సూపరింటెండెంట్ ప్రకాశ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఈస్ట్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆదివారం భక్తలెవ్వరినీ ఆలయంలోకి అనుమతించకుండా తనిఖీలు చేపట్టిన అధికారులు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాల్ని గుర్తించారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌, టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ నేతృత్వంలో పోలీస్‌ , విజిలెన్స్‌ బృందాలు ఆలయ అర్చకులను, సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు, అధికారులు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇక, గోవిందరాజస్వామి ఆలయాన్ని టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్ పరిశీలించారు. స్వామి వారి కిరీటాలు మాయమైన ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆలయంలోని సీసీ కెమెరాలన్నీ పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్పారు. మాయమైన స్వర్ణ కిరీటాల ఖరీదు దాదాపు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

గోవిందరాజస్వామికి చెందిన మూడు స్వర్ణ కిరీటాలు మాయమవడం టీటీడీ వర్గాల్లో కలకలం రేపింది. స్వామివారికి, అమ్మవారికి ఇవే కిరీటాలను అలంకరించి ప్రత్యేక వాహనాల్లో తరచూ ఊరేగిస్తారు. శనివారం ఉదయం సుప్రభాతసేవ సమయంలో కనిపించిన ఉత్సవమూర్తుల కిరీటాలు ఆ తర్వాత మాయమవడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ అంశంపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరా దృశ్యాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తే.. కిరీటాలు తీసి ఉంటాడా? లేక ఇంకెవరైనా అయ్యుంటారా?అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
First published: February 3, 2019, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading