WEST GODAWARI IN ANDHRA PRADESH ONE YOUN GIRL SENSATIONAL ALLEGATIONS AGAINST ITDA OFFICER NGS VZM
Andhra Pradesh: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్... మరో వీడియో కలకలం
యువతిపై లైంగిక వేధింపుల వీడియో కలకలం
సినిమా అవకాశాలైనా.. ఉద్యోగ అవకాశాలైనా లైంగిక వేధింపులు కామన్ అయ్యాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతి వీడియో వైరల్ గా మారింది. కానీ ఆమె కాసేపటికే మరో వీడియో కూడా చేయడం కలకలం రేపుతోంది.
కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో తరచూ వినపడే పదం.. అవకాశాల కోసం ఎంతోమంది ఎదుర్కుంటోన్న సమస్య ఇది.. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తామని మోసం చేసే ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. వింటున్నాం.. అయితే ఇది కేవలం సినిమా.. సీరియల్ ఇండస్ట్రీకే పరిమితం అవ్వలేదు. అన్నిరంగాల్లోనూ ఉందన్నది బహిరంగ రహస్యం.. యువతుల అవసరాలను క్యాష్ చేసుకునే మాయగాళ్లు ఎందరో ఉన్నారు ఈ సొసైటీలో.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన అధికారి తనకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియా లో ఓ యువతి వీడియో రిలీజ్ చేసింది.. క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనలా మరో యువతికి జరగకూడదనే వేదనతో వీడియో పోస్ట్ చేస్తున్నాను అని.. ఇది సీఎం జగన్ కు చేరే వరకు షేర్ చేయాలని యువతి కోరడంతో నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. అలా వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ పెరిగింది....
ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం తాను టీటీసీ పూర్తి చేయడంతో ఉద్యోగం వస్తుందని ఇద్దరు వ్యక్తులు నమ్మించారని.. అందులో ఒకరు సదరు అధికారి వద్దకు తీసుకెళ్లడంతో దానిని అదునుగా చూసుకున్న అధికారి తనను శారీరకంగా వినియోగించుకున్నారని ఆరోపించింది. నేరుగా ఆ అధికారి పేరు చెబుతూ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏజెన్సీలో హాట్ టాపిక్ గా మారింది.
తాను మోసపోయానని గ్రహించి మరొక మహిళ ఈ విధంగా మోసపోకూడదని తాను ఈ విధంగా వీడియో విడుదల చేస్తున్నట్లు యువతి వీడియోలో వివరణ ఇచ్చింది. ఆ యువతి వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీడీఏ పీవో ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ పీవో ఆర్.వీ సూర్యనారాయణ ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహరం దుమారం రేపడంతో సద్దుమణిగించేందుకు కొందరు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అప్ ల్యాండ్ కి చెందిన ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏం జరిగింది ఏమో.. కాసేపటికే ఆ యువతి మరో వీడియో విడుదల చేసింది.
తనను బెదిరించి కొందరు అలా చెప్పించారు తప్ప ITDA PO తో తనకు ఎలాంటి వేధింపులు జరగలేదు అంటూ ఆ వీడియోలో వివరణ ఇచ్చింది. అయితే జిల్లా లోని ఒక ఉన్నత స్థాయి ఉద్యోగిపై ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు నిర్దారించి ప్రజలకు తెలియ చేయాలంటున్నారు స్థానికులు, మహిళల సంఘాలు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.