నిజామాబాద్: చేతికందొచ్చిన 24 ఏళ్ల కొడుకును, కడదాకా కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భార్యను కరోనా మహమ్మారి మింగేయడంతో ఆ ఇంటి పెద్ద గుండెలవిసేలా రోదిస్తున్నాడు. కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తమ కుటుంబానికే ఎందుకిలా జరిగిందని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటు చేసుకుంది. వర్ని మండలంలోని సైద్పూర్ గ్రామానికి చెందిన శ్రీహరి నాయక్ నిజామాబాద్ నూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయన భార్య మేనాబాయి, కొడుకు నవీన్ రాథోడ్‌తో కలిసి సైద్పూర్లోనే నివాసముంటున్నారు. కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న పరిస్థితులను వార్తా పత్రికల్లో, టీవీల్లో చూసిన ఈ కుటుంబం ముందు నుంచి అప్రమత్తంగా ఉంది. బయటకు వెళ్లొస్తే కాళ్లూచేతులు శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లడం, మాస్క్‌లను తప్పనిసరిగా ధరించడం.. ఇలా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించింది. పాపం.. అయినా ఈ కుటుంబాన్ని విధి వంచించింది. కొద్దిరోజుల క్రితం మేనా బాయి, నవీన్ రాథోడ్ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్సనందించారు. అయినప్పటికీ తల్లీకొడుకు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. గాంధీ హాస్పిటల్లో చేర్పించి చికిత్సనందించారు. అయినా వైరస్ అప్పటికే ఆ ఇద్దరినీ మరింత క్షీణించేలా చేసింది. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ నవీన్ మే 14న చనిపోయాడు. పాతికేళ్లు కూడా నిండని కొడుకు మరణం కుటుంబంలో కల్లోలం రేపింది. తీరని విషాదాన్ని నింపింది. కొడుకు చనిపోయిన సంగతి తెలుసుకున్న మీనా మానసికంగా కుంగిపోయింది. 24 ఏళ్ల కొడుకు ప్రాణాలను కాపాడుకోలేకపోయామనే బాధ ఆమెను మరింత కుంగతీసింది.
కొడుకును కోల్పోయిన శ్రీహరి నాయక్ భార్యను ఎలాగైనా బతికించుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. కరోనా మహమ్మారి ఆ కుటుంబంపై పగబట్టినట్టుగా మీనా బాయి ప్రాణాలను కూడా హరించింది. చికిత్స పొందుతూ మే 25న మీనా కూడా పరిస్థితి విషమించి చనిపోయింది. ఆమె వయసు 48 సంవత్సరాలు. కట్టుకున్న భార్య, చేతికందొచ్చిన కొడుకు మరణం శ్రీహరి నాయక్‌ను ఒంటరి వాడిని చేసింది.
ఇన్నాళ్లూ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్న ఆయనకు కరోనా మహమ్మారి కుటుంబాన్నే దూరం చేసింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కుటుంబాన్ని బతికించుకోలేకపోయానని ఓ పక్క కొడుకు చిత్రపటం, మరోవైపు భార్య శవాన్ని చూసి శ్రీహరి నాయక్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. నవీన్ చనిపోయిన 12 రోజుల వ్యవధిలోనే మీనా చనిపోవడం గమనార్హం. తల్లీకొడుకు అకాల మరణంతో సైద్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona deaths, Covid -19 pandemic, Nizamabad