P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18
జీవితంపై ఎన్నో కలలు కన్నారు.. త్వరలోనే వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న యువకుడు.. అతడ్ని మరింత అందంగా ఫోటోల్లో బంధించాలి అనుకన్న మరో ఇద్దరిపై విధికి కన్ను కుట్టుంది. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పెళ్లి ఫోటో షూట్ కోసమని జలపాతం దగ్గరకు వెళ్లిన వారి ప్రాణాలను తీసుకుంది. ఫోటో షూట్ లో భాగంగా.. జలపాతానికి దగ్గరగా వెళ్లి సరదాగా ఫొటోలు తీసుకుంటూ కాలుజారి ఊబిలో చిక్కుకుపోయి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోతున్న ఈత రాని ఇద్దరు మిత్రులను కాపాడే ప్రయత్నంలో మరో యువకుడు నీటిలో మునిగిపోయాడు.
విశాఖ జిల్లా హుకుంపేట మండలం తీగలవలసలో ఈ విషాదం ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రిషికేష్ తెలిపిన వివరాల ప్రకారం... సన్యాసమ్మపాలెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల మోరి నిరంజన్, 25 ఏళ్ల బాకూరు వినోద్‌కుమార్, 22 ఏళ్ల తమర్భ శివనాగేంద్రకుమార్‌లు మరో ఏడుగురు యువకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం తీగలవలస గ్రామ సమీపంలోని గుడ్డిగుమ్మి జలపాతానికి వెళ్లారు. అయితే అందులో ముగ్గురు తమ స్నేహితుడికి త్వరలో వివాహం ఉండడంతో పెళ్లి ఫోటో షూట్ నిర్వహిద్దామని జలపాతానికి దగ్గరగా వెళ్లారు...
ఈ ముగ్గురు ఫోటోలతో బిజీగా ఉండగా.. మిగిలిన వారు వేరే చోట స్నానాలు చేస్తున్నారు. అలా సరదాగా ఫొటోలు తీసుకుంటున్న సమయంలో నిరంజన్, వినోద్‌కుమార్ కాలుజారి ఊబిలాంటి ప్రాంతంలో చిక్కుకున్నారు. అయితే ఆ ఇద్దరికీ ఈత రాదు. ఒడ్డునే ఉన్న వినోద్ కుమార్‌కు ఈత రావడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతడూ నీటిలో మునిగిపోయాడు. వీరితోపాటు వచ్చిన మిగిలిన వారు ఈ విషయం గమనించే లోపే ముగ్గురూ గల్లంతయ్యారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో ఎవరూ సహాయం చేసేవారు లేకుండాపోయారు.
ఇదీ చదవండి: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త గైడ్ లైన్స్ పై నేడు సీఎం జగన్ ప్రకటన..
సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి యువకుల ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. వారు మునిగిపోయిన ప్రాంతం పెద్ద ఊబిలా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. హుకుంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆదివారం రాత్రి వరకు మునిగిపోయిన వారిని బయటకు తీయడం కుదరలేదు. ఉదయాన్నే ఆ మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం మొదలెట్టారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్... మళ్లీ వేసవి సెలవులను పొడిగించిన ఏపీ సర్కార్
గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నీట మునిగి ప్రాణాలు పోయాయని సంగతి తెలియడంతో సన్యాసమ్మపాలెంలో విషాదఛాయలు అలకుమున్నాయి. కరోనా కారణంగా కొద్దిరోజులుగా ఈ యువకులు గ్రామంలోనే ఉంటున్నారు. రోజూ తమ కళ్లముందే ఉండేవారని, ఆదివారం ఉదయమంతా కుటుంబ సభ్యులతోనే ఉన్నారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఈ ముగ్గురు యువకుల్లో బాకూరు వినోద్‌కుమార్ ఉన్నత విద్యావంతుడు. ఎం.ఫార్మసీ పూర్తి చేశాడు. శనివారమే అతడి పుట్టినరోజు. తరవాత రోజే అనుకోని రీతిలో ప్రమాదానికి గురయ్యాడని తండ్రి నాగరాజు కన్నీరుమున్నీరయ్యారు. మిగిలిన ఇద్దరిలో నిరంజన్ ఇంటర్ చదువుకోగా, శివనాగేంద్ర కుమార్ డిగ్రీ పూర్తిచేశాడు. చేతికందొచ్చిన కొడుకులు ఏమయ్యారో ఇలా మరణించడంతో వారి తండ్రులు మాణిక్యం, విశ్వనాథం పడాల్ నీరు నిండిన కళ్లతో జలపాతం వద్ద రోధిస్తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakha, Visakhapatnam, Vizag