ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఘర్షణలు.. స్ట్రీట్ ఫైట్లు.. గ్యాంగ్ వార్ లు పెరిగాయి. ఇటీవల ఇలాంటి కేసులు పెరుగుతుండడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారితే పరిస్థితి ఇంకాస్త ఆందోళనకరంగా మారుతుందని భయపడుతున్నారు. ఇటీవల రౌడీ షీటర్ల సంఖ్య పెరిగింది. వారి మధ్య ఆధిపత్య పోరు హత్యలకు కూడా దారితీస్తోంది. దీంతో నగర వాసులు భయం భయంగానే గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్ విద్యార్థుల ఘర్షణ కలకలం రేపింది.
విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి మరో విద్యార్థిపై విచక్షణారహితంగా బ్లేడుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాకలోని రెండు వేర్వేరు ప్రైవేటు కళాశాలల్లో త్రినాథ్, సంతోష్ ఇద్దరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. రోజులాగే ఇద్దరు కాలేజీకి వెళ్లారు. అందరిలానే కళాశాలలు విడిచిపెట్టిన తరువాత.. మాట్లాడుకుందాం అనుకుని ఒక చోటికి వెళ్లారు. అయితే అలా మాట్లాడుకోడానికి ఓ ప్రాంతానికి వెళ్లిన వారి మధ్య మాటామాటా పెరగిరింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన సంతోష్ బ్లేడు తీసి త్రినాథ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో త్రినాథ్ భుజం, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అతడి కేకలు విన్న తోటి విద్యార్థులు అప్పటికే సంతోష్‌ను నిలువరించేందుకు ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకొని పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన త్రినాథ్.. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంతోష్, త్రినాథ్ గతంలో ఒకే కళాశాలలో చదివారు. అయితే సంతోష్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో యజమాన్యం అతడిని కళాశాల నుంచి పంపించేసింది. గతంలో కూడా పలువురితో సంతోష్ గొడవలు పడినట్టు ఇతర విద్యార్థులు చెబుతున్నారు. అయితే సంతోష్ ముందు ప్లాన్ వేసుకునే తనతో పాటు బ్లేడ్ తెచ్చి ఉంటాడని.. ప్రేమ విషయంలో లేదా డబ్బులు విషయంలోనో వీరిద్దరి మధ్య గొడవ అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్రినాథ్ స్పృహలోకి వచ్చాక ఘటనకు గల కారణాలు తెలుస్తాయని గాజువాక ఎస్సై గణేశ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Visakha, Visakhapatnam, Vizag