ఒక కేసులో ముద్దాయిగా ఉండి.. కోర్టు కేసుకు హాజరవడానికి వస్తే ఏం చేస్తారు? నేరుగా కోర్టుకు వెళ్తారు.. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు. లేదా పశ్చాత్తాప పడి మరోసారి ఇలాంటి పనులు చేయం అని చెప్పి మనుషులుగా మారుతారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ తండ్రి, ఇద్దరు కొడుకుల కథ మాత్రం అందుకు భిన్నం. చోర కళలో ముగ్గురివీ ఆరితేరిన చేతులు. ఇప్పటికే ఎన్నో కేసుల్లో శిక్షలు అనుభించారు. మరికొన్ని కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కూడా. అయినా వారు వెనక్కు తగ్గడం లేదు. మరిన్ని భారీ దొంగతనాలను టార్గెట్ చేస్తూ పోలీసులకు సవాల్ విసిరుతున్నారు..
తాజాగా విశాఖ జిల్లాలో నమోదైన గంజాయి కేసులో కోర్టు వాయిదాలకు వచ్చి వెళ్తున్నారు ఆ తండ్రీ కొడుకులు. అలా ఈ నెల 20న కోర్టు వాయిదా కోసమని విశాఖ నగరానికి వచ్చారు ఆ తండ్రి కొడుకులు.. అయితే వచ్చిన పని చూసుకోకుండా.. కోర్టుకు హాజరయ్యేందుకు ఒక రోజు అంతా సమయం ఉండడంతో.. అదేరోజు రాత్రి పెద్ద స్కెచ్ వేశారు. పోలీసులకు క్లూలు కూడా దొరకనంతంగా పథకం రచించి గంటలోనే పని పూర్తి చేసుకుని పరారయ్యారు. విశాఖలోని పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ ఆలయంలోకి పక్కా ప్లాన్ ప్రకారం చొరబడ్డారు. అందులోకి ప్రవేశించిన తరువాత 412 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండి అపహరించుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ ముగ్గురి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడించనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడుకు చెందిన తండ్రీ కొడుకులే ఈచోరీ చేశారని ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నెల 21న పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. అప్పటికి ఆలయంలో తలుపులు వేసి ఉండడం.. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ఆలయంలోకి చొరబడ్డ ముగ్గురు దొంగలు.. దొరికినంత దోచుకున్నారు. 412 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయినట్టు తరువాత ఆలయ అధికారుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే వారు సాంకేతికంగా ఫుల్ సౌండ్ ఉన్న దొంగలు. అందుకే వాయిదాలకు వచ్చి కూడా మరో దొంగతానాన్ని టార్గెట్ చేయగలిగారు. అంతేకాదు పోలమాంబ ఆలయంలో చోరీ చేసిన తరువాత.. ఎవరికి అనుమానం రాకుండా.. ఎలాంటి క్లూలు దొరక్కుండా చేసేందుకు అక్కడున్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను తీసుకుని పరారయ్యారు. దీంత్ దర్యాప్తు పోలీసులకు క్లిష్టంగా మారింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు దర్యాప్తును పర్యవేక్షించడంతో చోరీకి సంబంధించిన కీలకమైన ఆధారం లభ్యమైనట్టు తెలిసింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో సెల్‌ఫోన్ టవర్ పరిధిలో కాల్ డేటాను విశ్లేషించారు. చోరీ జరగడానికి ముందురోజు ఓ ఫోన్ నంబర్ నుంచి జిల్లా కోర్టు టవర్ లొకేషన్లోకి కొన్ని కాల్స్ వచ్చి, వెళ్లినట్టు గుర్తించారు. దీంతో కోర్టు వర్గాల ద్వారా ఆ ఫోన్ నంబర్‌కు సంబంధించిన వ్యక్తి వివరాలు ఆరా తీయగా తమిళనాడుకు చెందిన వ్యక్తిదిగా తేలింది. అతడి గత చరిత్రపై అక్కడి పోలీసులను వాకబు చేయగా.. అతడిపై కొన్ని చోరీ కేసులు వున్నట్టు తేలింది. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా అతడితోపాటు మరో ఇద్దరు యువకులు వుండడంతో వారి గురించి ఆరా తీస్తే.. వారిద్దరూ అతడి కుమారులేనని తేలింది. దీంతో వారే నేరానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
తండ్రీకొడుకులు ముగ్గురిపై జిల్లా కోర్టులో గంజాయి కేసు విచారణలో ఉంది. ఆ కేసు వాయిదాలో భాగంగా ఈ నెల 20న నగరానికి వచ్చినట్టు గుర్తించారు. ఒక లాడ్జిలో బస చేసి ఉదయం కోర్టు వాయిదాకు హాజరయ్యారు. తరువాత నగరంలో చోరీ చేసేందుకు అనువైన ఇళ్లు, ఆలయాలను గుర్తించేందుకు రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో పోలమాంబ ఆలయం దగ్గర వాచ్‌మన్ ఒక్కరే వుండడం గమనించారు. 20వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో ఆలయం వెనుక వైపు నుంచి గోడ దూకి లోపలకు ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే సీసీ కెమెరాలను ఆఫ్ చేసి సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. తరువాత ఈవో గది తాళం విరగ్గొట్టారు. గదిలోని బీరువాను తెరిచి అందులోని 412 గ్రాములు బంగారం, నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. తిరిగి వెళుతూ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను వెంట తీసుకుపోయారు.
నగరంలో రెండు రోజులూ జరిగిన నాలుగు చైన్‌స్నాచింగ్ కేసులు కూడా ఇదే గ్యాంగ్ పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. తండ్రి లాడ్జిలో వుండిపోగా ఇద్దరు కుమారులు ఒక బైక్‌పై ఈ నెల 21వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో పీఎం పాలెం ఆఖరి బస్టాప్ వద్ద బస్సు దిగి నడిచి వెళుతున్న ఒక మహిళ మెడలోని రెండున్నర తులాల పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యారు. అక్కడి నుంచి కొమ్మాది కూడలికి వెళ్లి అక్కడ ఇద్దరు మహిళలు నడిచి వెళుతుండగా ఒకరి మెడలోని ఐదు తులాల హారం తెంచుకుపోయారు. అక్కడి నుంచి మిథిలాపురి వుడా కాలనీకి చేరుకుని యమహా షోరూమ్ ఎదురుగా నిలబడి వున్న ఒక మహిళ మెడలోని ఏడు తులాల ఆభరణాలను తెంచుకుని పరారైపోయారు. అక్కడి నుంచి సాయిప్రియ లే అవుట్‌కు వెళ్లి అక్కడ భార్యాభర్తలు నడిచివెళుతుండగా వెనుక నుంచి వెళ్లి మహిళ మెడలోని నాలుగు తులాల ఆభరణాలను తెంచుకుని పరారైపోయారు. వీటికి సంబంధించిన సీసీ ఫుటేజీ సేకరించిన పోలీసులు పోలమాంబ ఆలయంలో చోరీ కేసు దర్యాప్తు కోసం సేకరించిన సీసీ ఫుటేజీలోని నిందితులతో సరిపోల్చి.. వారూ, వీరూ ఒక్కరేనని గుర్తించారు. అయితే నిందితులు పట్టుబడిన తరువాత ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Visakha, Visakhapatnam