Home /News /crime /

VISAKHAPATNAM KARAKACHETTU POLAMBAA TEMPLE THEFT CASE FATHER AND 2 SONS ARRESTED VZM NGS

Visakhapatanam: బెయిల్ కోసం వచ్చారు ఆలయాన్ని దోచేశారు? తండ్రీ కొడుకుల గుట్టు విప్పిన సీసీ కెమెరాలు? అచ్చం సినిమా స్టైల్లో దొంగతనం

బెయిల్ కోసం వచ్చి ఆలయాన్ని దోచేశారు తండ్రీ కొడుకులు

బెయిల్ కోసం వచ్చి ఆలయాన్ని దోచేశారు తండ్రీ కొడుకులు

ఓ తండ్రి ఇద్దరు కొడుకులు వీరు మామూలు దొంగలు కాదు.. ఒక కేసు విషయంలో బెయిల్ కోసం అని వచ్చి.. అమ్మవారి నగలే దోచుకెళ్లారు. అచ్చం సినిమా స్టైల్లో కొడుకును బయట కాపాలా ఉంది.. లోపలకు వెళ్లిన తండ్రి మరో కొడుకు పని కానిచ్చేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీ కెమెరాలు కూడా ఎత్తుకెళ్లారు. అయినా ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు.

ఇంకా చదవండి ...
  ఇటీవల విశాఖపట్నంలో పెను సంచలనం రేపిన పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ భారీ చోరి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన తండ్రి, ఇద్దరు కొడుకులే ఈ పని చేశారని నిర్ధారణకు వచ్చారు. వీరిని చాలా తెలివైన దొంగలుగా గుర్తించారు. తండ్రి, పెద్ద కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు, మైనర్‌ అయిన చిన్న కొడుకును జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. ఈ తండ్రీ కొడుకుల నుంచి 248 గ్రాముల బంగారం, 4.128 కిలోల వెండి, 2.45 లక్షల నగదు రికవరీ చేసినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

  పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మార్చి 20వ తేదీన అర్ధరాత్రి దుండగులు చొరబడి 411.75 గ్రాముల బంగారం, 4.128 కిలోల వెండి ఆభరణాలు, ఆలయంలోని ఒక ఒకహుండీని పగులగొట్టి అందులో ఉన్న3 లక్షల 25 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. 21వ తేదీ తెల్లవారున ఆలయానికి వచ్చిన పూజారులు చోరీ జరిగింది అన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆలస్యం చేయకుండా చోరీ విషయాన్ని గుర్తించి ఈవో నీలిమకు సమాచారం అందించారు. ఆమె త్రీటౌన్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం దగ్గర లభించిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తుతో కన్యాకుమారి జిల్లా సౌత్‌కుండాకు చెందిన 43 ఏళ్ల పి.ఉమేష్‌, అతడి పెద్దకొడుకు 19 ఏళ్ల ధీరజ్‌, 17 ఏళ్ల చిన్నకొడుకు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.

  తమిళనాడులోని నాగపట్నంకి చెందిన ఉమేష్‌ చిత్తూరు జిల్లాకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లు చిత్తూరులో ఉన్నాడు. ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత రెండో పెళ్లి చేసుకుని పదిహేడేళ్ల రెండో కుమారుడితో కలిసి కన్యాకుమారి వెళ్లి బీచ్‌లో బట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు ధీరజ్‌ తిరుపతిలోని ఒక హోటల్‌లో చెఫ్‌ కమ్‌ వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గతంలో ధీరజ్‌ తన పుట్టినరోజు వేడుకలకని తనకు తెలిసిన ఒక వ్యక్తిని డబ్బులు అడిగాడు. అతడు విశాఖ జిల్లా పాయకరావుపేట వెళితే అక్కడ ఒక వ్యక్తి బ్యాగ్‌ ఇస్తాడని, దానిని తీసుకువస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీంతో ధీరజ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాయకరావుపేట వచ్చి ఎవరో ఇచ్చిన బ్యాగ్‌ను తీసుకుని తిరుపతి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, పోలీసులు తనిఖీ చేశారు.

  ధీరజ్ బ్యాగ్‌లో గంజాయి వుండడంతో అతడిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ధీరజ్‌ను బెయిల్‌పై విడిపించుకుని తీసుకువెళ్లేందుకు అతడి తండ్రి ఉమేష్‌, పదిహేడేళ్ల సోదరుడు కలిసి మార్చి 16న విశాఖపట్నం వచ్చారు. నేరుగా జిల్లా కోర్టుకు వెళ్లి ఒక న్యాయవాదితో మాట్లాడగా, బెయిల్‌ ఏర్పాట్లు చేస్తానని చెప్పి మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని విజయభాను హోటల్‌లో బస ఇప్పించాడు. అయితే మూడు రోజుల పాటు విశాఖలో ఉన్నా కొడుకు ధీరజ్ బెయిల్‌ మంజూరు కాలేదు. తండ్రీకొడుకులిద్దరూ ఆ సమయంలో పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ ఆలయానికి ఒకసారి వెళ్లివచ్చారు. ధీరజ్‌కు 19న బెయిల్‌ జారీ అయినా, 20న జైలు నుంచి విడుదలయ్యాడు.

  ఉమేష్‌, అతడి చిన్న కుమారుడు ఇద్దరూ.. ఈనెల 20న రూమ్‌ ఖాళీ చేసి బ్యాగ్‌ను అక్కడి వాచ్‌మన్‌కు ఇచ్చి మళ్లీ వచ్చి తీసుకుంటామని చెప్పి ధీరజ్‌ కోసం జైలుకు వెళ్లారు. అతడ్ని తీసుకుని నేరుగా ఆర్కే బీచ్‌కు వెళ్లి అక్కడి నుంచి నడుచుకుంటూ జగదాంబ జంక్షన్‌ వరకూ వచ్చారు. అక్కడ ఆటో ఎక్కి పూర్ణా మార్కెట్‌కు వెళ్లి దేవీభవానీ మెటల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌లో కత్తి, చిన్న గునపం వంటివి కొనుగోలు చేశారు. అక్కడి నుంచి నేరుగా పోలమాంబ ఆలయం దగ్గరకు చేరుకున్నారు. ఆలయం వెనుక వైపు రాత్రి ఒంటిగంట వరకూ గడిపి, ఆ తర్వాత ఎవరూలేని సమయంలో చోరీకి పాల్పడ్డారు.

  ఉమేష్‌ అతడి పెద్దకొడుకు ధీరజ్‌ ఆలయంలో చోరీకి వెళితే చిన్నకొడుకు ఆలయం వెనుక వైపు కాపలాగా ఉన్నాడు. ఉమేష్‌, ధీరజ్‌ తమ చేతిముద్రలు పోలీసులకు లభించకుండా గ్లౌజులు తొడుక్కున్నారు. ధీరజ్‌ ఆలయం గ్రిల్స్‌ గడియతోపాటు ఈవో గది తాళం విరగ్గొట్టి తిరిగి బయటకు వచ్చేశాడు. ఉమేష్‌ నేరుగా గర్భగుడిలోకి వెళ్లి ఆభరణాల కోసం వెతుకుతుండగా, బీరువా తాళాలు కనిపించాయి. వాటిని తీసుకుని ఈవో గదిలోకి వెళ్లి బీరువాను తెరిచి, అందులో వుంచిన బంగారం, వెండి ఆభరణాలను బ్యాగుతో సహా తీసుకున్నారు. తరువాత ఆలయంలోని ఒక హుండీ పగులగొట్టి అందులో వున్న డబ్బును కూడా అదే బ్యాగులో వేసుకున్నారు. తరువాత తండ్రీకొడుకులు ఇద్దరూ 300 అడుగులు వరకూ వచ్చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ధీరజ్‌కు సీసీ కెమెరాలు వున్న విషయం గుర్తుకురావడంతో తిరిగి వెనక్కి వెళ్లి ఆలయంలోని సీసీ కెమెరాల డీవీఆర్‌ను వెంట తెచ్చేశాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత గ్రిల్స్‌ గడియ విరగ్గొట్టేందుకు వాడిన ఆయుధాలను పడేశారు. ఆలయం నుంచి తెచ్చిన బ్యాగ్‌ను కూడా అక్కడే వదిలేసి ఆభరణాలు, నగదును తమ వద్ద బ్యాగ్‌లో వేసుకుని నేరుగా హోటల్‌ వద్దకు వెళ్లి అక్కడ వాచ్‌మన్‌ వద్ద వుంచిన బ్యాగ్‌ను తీసుకుని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి, అక్కడి నుంచి విజయవాడ మీదుగా కన్యాకుమారి వెళ్లిపోయారు. అక్కడ చోరీ ఆభరణాలను విక్రయించేందుకు యత్నించగా, అవన్నీ దేవుడి విగ్రహాలు, ఇతర ఆభరణాలు కావడంతో ఎవరూ కొనలేదు. దీంతో వాటిని కరిగించేశారు.

  పోలమాంబ ఆలయం చోరీ కేసులో పోలీసులకు మొదట్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. డాగ్‌స్క్వాడ్‌ 300 అడుగులు ముందుకువెళ్లి ఆగిపోవడంతో అక్కడ వెతకగా, కొన్ని ఆయుధాలు లభించాయి. దీంతో ఆ ఆయుధం ఎక్కడ కొన్నారనేది తెలుసుకునేందుకు నగరంలో అలాంటి ఆయుధాలను విక్రయించే దుకాణాల్లో పోలీసులు ఆరా తీయగా, చోరీకి ముందురోజు పూర్ణామార్కెట్‌లోని ఒక దుకాణంలో వాటిని కొన్నట్టు తేలింది. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారెవరనేది తెలియకపోవడంతో దుకాణంలో నమోదైన సమయం ఆధారంగా ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించగా ఒక ఆటోలో వారు అక్కడ దిగినట్టు గుర్తించారు. ఆటో వివరాలు ఆరా తీయగా 60 ఏళ్ల ఆటో డ్రైవర్‌ వారిని జగదాంబ కూడలిలో ఎక్కించుకున్నట్టు చెప్పాడు.

  వారు కేజీహెచ్‌ వైపు నుంచి వచ్చారని చెప్పడంతో వాటికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, వేరొక ఆటో డ్రైవర్‌తో మాట్లాడినట్టు కనిపించింది. దీంతో అతడ్ని విచారించగా తనతో తమిళ యాసతో కూడిన తెలుగులో ఒక వ్యక్తి మాట్లాడినట్టు చెప్పాడు. దీంతో చెన్నై, భువనేశ్వర్‌, జార్ఖండ్‌కు ప్రత్యేక బృందాలను పంపించారు. చివరకు వారు విజయభాను హోటల్‌లో బస చేసినట్టు దాని ఎదురుగా వున్న దుకాణం సీసీ కెమెరాల ద్వారా తేలడంతో హోటల్‌ సిబ్బందిని విచారించగా, ఒక న్యాయవాది వారిని అక్కడకు పంపినట్టు చెప్పారు. న్యాయవాదిని విచారించగా, వారి పూర్తి వివరాలను ఇచ్చారు. దీంతో కన్యాకుమారి వెళ్లిన ప్రత్యేక బృందం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో అద్భుతంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Crime story, Theft, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు