Viral News: భార్య వేధింపులతో 21 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. విడాకులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

Viral News: పెళ్లి నాటికి 74 కిలోల బరువు ఉండగా, తన భార్య క్రూరత్వం కారణంగా ఇప్పుడు 53 కేజీలకు తగ్గానని అతడు కోర్టుకు తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన మహిళ, వైవాహిక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నట్లు వాదించింది.

  • Share this:
భార్య క్రూరత్వం కారణంగా 21 కిలోల బరువు తగ్గిన శారీరక వికలాంగుడికి విడాకుల మంజూరు సబబేనని తెలిపింది పంజాబ్, హర్యానా హైకోర్టు. 50 శాతం వినికిడి లోపంతో బాధపడుతున్న ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు హిసార్ ఫ్యామిలీ కోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ బాధితుడి భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 74 కిలోల నుంచి 53 కిలోల వరకు బరువు తగ్గిన బాధితుడు, అతడి కుటుంబంపై మహిళ దాఖలు చేసిన అన్ని క్రిమినల్ ఫిర్యాదులు, కేసులు అబద్ధమని కోర్టు తెలిపింది. ఇది మానసిక క్రూరత్వానికి సమానమని తీర్పులో పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా బాధితుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కోర్టు గుర్తించింది.

జస్టిస్ రీతూ బహ్రీ, జస్టిస్ అర్చన పూరిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. 2019 ఆగస్టు 27న బాధితుడి పిటిషిన్‌ను విచారించిన హిసార్ ఫ్యామిలీ కోర్టు, విడాకులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని అతడి భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ జంటకు 2012 ఏప్రిల్‌లో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. బాధితుడు బ్యాంకు ఉద్యోగి కాగా, మహిళ హిసార్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. వీరి కుమార్తె ప్రస్తుతం తన తండ్రితో నివసిస్తుంది.

భార్య కారణంగా తనతో పాటు కుటుంబం మొత్తం మనోవేదనకు గురయినట్లు బాధితుడు కేసు పెట్టాడు. తన భార్య కోపిష్టి అని, ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుంటూ తన పరువు తీస్తోందని పేర్కొన్నాడు. కుటుంబంతో కలిసి ఉండే లక్షణాలు ఆమెకు లేవని.. తన తల్లిదండ్రులు, బంధువుల ముందు అవమానించేదని తెలిపారు. అయితే భార్య ప్రవర్తనలో మార్పు కోసం ఇన్నాళ్లు వేచి చూశానని, కానీ మార్పు రాకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని వివరించాడు.

పెళ్లి నాటికి 74 కిలోల బరువు ఉండగా, తన భార్య క్రూరత్వం కారణంగా ఇప్పుడు 53 కేజీలకు తగ్గానని అతడు కోర్టుకు తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన మహిళ, వైవాహిక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నట్లు వాదించింది. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తన భర్త, అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారని, అవమానించడం ప్రారంభించారని ఆమె పేర్కొంది.

ఇది కూడా చదవండి : భర్తతో రోజూ మాట్లాడుతుందని పక్కింటి మహిళపై కక్ష పెంచుకుంది.. చివరికి ఎంత పని చేసిందంటే..

అయితే ఆ మహిళ 2016లో తన భర్తతో పాటు కూతురిని కూడా వదిలేసి వెళ్లిపోయిందని కేసు విచారణ సందర్భంగా హైకోర్టు గుర్తించింది. భర్త కుటుంబం ఎటువంటి కట్నం డిమాండ్ చేయలేదని, పెళ్లి తర్వాత ఆమె ఉన్నత చదువులకు వారే ఖర్చు చేశారనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో మహిళ తన భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు ఫిర్యాదులు దాఖలు చేసినట్లు హైకోర్టు గుర్తించింది.

ఇది కూడా చదవండి : అంతలా ప్రేమించాడు..? ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనా..?

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆ మహిళ చర్యలు నేరపూరితమైనవని తెలిపింది. పెళ్లి తరువాత భర్త కుటుంబాన్ని వేధించడంతో పాటు వారిపై కేసులు పెట్టడం, కూతురిని వదిలేసి వెళ్లడం వంటివన్నీ మానసిక క్రూరత్వం కిందకే వస్తాయని పేర్కొన్న ధర్మాసనం.. మహిళ అప్పీలును కొట్టివేసింది.
Published by:Sridhar Reddy
First published: