(K.Veeranna,News18,Medak)
సాధారణ ప్రజలకు ఎక్కడకు వెళ్లినా న్యాయం జరగడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ అధికారులను పని చేయమంటే మాకేంటి అంటున్నారు. ప్రైవేటుగా మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ పేరు, వివరాలు, చిరునామా, ఆస్తి వివరాలకు సంబంధించిన దృవీకరణ పత్రాలు సరి చేయాల్సిన మీ సేవా నిర్వాహకులు సైతం కొత్త తరహాలో మోసానికి తెర తీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సిద్ధిపేట(Siddipet)జిల్లాలో ఇదే తరహాలో ఓ మీ సేవా (Mee seva)నిర్వాహకుడు అమాయకుల్ని మోసం చేయాలని చూస్తే తగిన గుణపాఠం చెప్పారు. స్థానికులు మీ సేవాను ధ్వంసం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
డబ్బు కోసం మోసం...
జనన, మరణాలు, ఆస్తి పత్రాలు, ఇంటి పేపర్లు, కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూమి పాస్ పుస్తకాల్లో యజమాని వివరాలు ఇలాంటి వాటిని సరి చేయడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాల్సిన మీ సేవా నిర్వహకులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో మీ సేవ కేంద్ర నిర్వహకుడు ఇస్తారి అనే వ్యక్తి రైతుల నుంచి లేనిపోని సమస్యలు సృష్టిస్తూ అడ్డగోలుగా డబ్బులు లాగుతున్నారని ఆరోపిస్తూ గురువారం తహశీల్దారుకు గ్రామస్తులు వినతిపత్రం అందించారు.
కోపోద్రేకులైన గ్రామస్తులు..
గ్రామస్తుల ఫిర్యాదుతో శుక్రవారం మీ సేవ కేంద్రంపై విచారణకు ఆర్ఐ నాగరాజు వచ్చారు. విచారణ చేస్తున్న క్రమంలో గ్రామస్తులు ఒకేసారి మీ సేవ కేంద్రంపైకి దాడికి దిగారు. పత్రాల్లో పేర్లు తప్పుగా నమోదు చేసి అనవసరంగా మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్నాడని మీ సేవాలోని పర్నీఛర్ తో పాటు కంప్యూటర్, జిరాక్స్ మిషన్లను ధ్వంసం చేశారు. ఇది జరుగుతున్న సమయంలోనే మీ సేవా నిర్వహకుడు ఇస్తారి గ్రామస్తుల్లో ఒకరిని కిందపడేసి దాడి చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసిల్దార్ అధికారుల ముందే గ్రామస్తులపై జులుం ప్రదర్శించేందుకు ప్రయత్నించిన మీ సేవా నిర్వాహకుడు ఇస్తారి భార్యపై దాడి చేశారు.
మీ సేవా కేంద్రం ధ్వంసం..
మీ సేవాలో అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలతో గ్రామస్తులు రసాభాసకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉద్రిక్తత ఏర్పడడం వల్ల పోలీసులు బందోబస్తును నిర్వహించారు. అనంతరం గజ్వేల్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి గ్రామానికి చేరుకుని పూర్తి వివరాలను తెలుసుకున్నారు. గాయాలు అయిన వారిని హాస్పిటల్ కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. మీ సేవ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Telangana crime news