• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • VIJAYAWADA POLICE CRACKDOWN THE MURDER MISTERY IN VISSANNAPETA 3 ARRESTED MU

Vissannapeta Murders: అక్రమ సంబంధమే హత్యకు కారణం... వీడిన విస్సన్నపేట మిస్టరీ

Vissannapeta Murders: అక్రమ సంబంధమే హత్యకు కారణం... వీడిన విస్సన్నపేట మిస్టరీ

ప్రతీకాత్మక చిత్రం

మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన అనుమానాస్పద మరణాల మిస్టరీ వీడింది. ఈ కేసులో లోతుగా విచారణ జరిపిన పోలీసులు మిస్టరీని చేధించారు.

 • News18
 • Last Updated:
 • Share this:
  వివాహేతర సంబంధాలు పండంటి కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి, సినిమాల ప్రభావం, మితిమీరిన సాంకేతికత.. కాపురాలను సర్వనాశనం చేస్తున్నది. సమాజంలో వస్తున్న మార్పులు కూడా మనుషులలో నేర ప్రవృత్తిని పెంచే విధంగానే ఉంటున్నాయి. దీంతో దేశంలో ఏ మూలకెళ్లినా.. నిత్యం ఏదో ఒక నేరం. ఫలితంగా కాపురాలు కూలిపోయి.. ఏకంగా వారు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా విస్సన్నపేటలో వెలుగులోకి వచ్చిన అనుమానాస్పద మరణాల కేసులోనూ ఇదే జరిగింది.

  సోమవారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేధించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. చింతలపూడికి చెందిన దాసరి వెంకన్న అనే వ్యక్తి పింగాణి పాత్రలు విక్రయించేవాడు. అతడి దగ్గరికి కొద్దికాలం నుంచి నూజివీడుకు సమీపంలో ఉన్న ఈదర గ్రామానికి చెందిన చిన్న ఏసు (35) పని చేస్తున్నాడు. ఈ క్రమంలో చిన్న ఏసు.. వెంకన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా.. వెంకన్నకు తెలియడంతో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. ఏసుపై కక్ష పెంచుకున్న వెంకన్న.. అతడిని చంపేందుకు కుట్ర పన్నాడు.

  ఇందుకోసం ఏసుతో స్నేహాం చేస్తున్నట్టు నటించాడు. గత ఆదివారం వెంకన్నను కలిసి.. ఫుల్లుగా మందు తాగించాడు. మద్యం మత్తులో ఉన్న ఏసు తో అతడి కుటుంబంతో కలిసి నూజివీడు వెళ్దామంటూ నమ్మించాడు. అంతకుముందే వేసుకున్న పథకం ప్రకారం వెంకన్న భార్య నాగమణి, కుమారుడిని మరో ఆటోలో నూజివీడు వెళ్లే దారిలో కనిపించేలా చేశాడు. ఆటో రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లి దాటగానే... ఒక మామిడి తోటకు తీసుకెళ్లి.. ఏసుతో మళ్లీ మందు తాగించారు. ఇదే అదునుగా భావించి.. ఏసుపై ఇనుపరాడ్డుతో గట్టిగా బాదారు. అతడిని రాడ్డుతో కొట్టి చంపారు. హత్య విషయాన్ని బయటపెడతారనే భయంతో.. చిన్న ఏసు భార్య తిరుపతమ్మ, కుమార్తె మీనాక్షిలను వెంబడించారు. ఘటనాస్థలం నుంచిపారిపోతున్న వాళ్లను పట్టుకుని.. రాడ్లతో తల పగలగొట్టి చంపారు. చిన్నారి మీనాక్షిని చున్నీతో ఉరివేసి ప్రాణాలు తీసేశారు.

  అయితే చంపిన వీరిని రోడ్డు ప్రమాదంలో మరణించారని చిత్రీకరించేందుకు వెంకన్న మాస్టర్ ప్లాన్ వేశాడు. విస్సన్నపేటలోని నాగార్జున సాగర్ కాలువ వద్దకు తీసుకొచ్చి.. ఆటోతో పాటు మృతదేహాలను కాలువలోకి పడేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కాలువ రెజిమెంట్ గోడ వద్ద ఆటో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న మూడు మృతదేహాలు, పాత సామాను కాలువలో ఉన్న పొదలలో పడిపోయాయి. ఇది గమనించిన వెంకన్న.. అతడి భార్య, కుమారుడిని మరో ఆటో తెమ్మని దానితో కాలువలో ఇరుక్కుపోయిన ఆటోను బలవంతంగా నెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఎంతకూ ఆటో కదలకపోవడంతో దానిని అక్కడే పడవేసి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

  మృతదేహాలను చూసిన మృతుడి తండ్రి మల్లయ్య.. ఇది హత్యేనని, తన కొడుకు పనిచేస్తున్న యజమానే ఈ పని చేసి ఉంటాడని ఆరోపించాడు. దీంతో ఈ కోణంలో కేసును విచారించిన పోలీసులు.. అసలు విషయాన్ని రాబట్టారు. నిందితులను పట్టుకుని విచారించారు. నూజివీడు, నందిగామకు చెందిన పోలీసు బృందాలు కలిసి ఈ మిస్టరీని చేధించాయి. నిందితుడి కుమారుడిని జ్యువనైల్ కోర్టుకు పంపి.. భార్యాభర్తలనుు కోర్టుకు హాజరుపర్చుతామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన.. పోలీసులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
  Published by:Srinivas Munigala
  First published: