Andhra Pradesh: ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కే టోకరా... రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు..

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crime: ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు. ఇన్నాళ్లూ బ్యాంకుల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్లు.. ఇప్పుడు కస్టమర్ కేర్ పేరుతో దోచేస్తున్నారు.

  • Share this:
    సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఎవరికీ చిక్కకుండా మోసాలు చేస్తున్నారు. సామాన్యూలే కాదు అన్నీతెలిసిన వారికి టోకరా వేస్తూ లక్షలు దోచేస్తున్నారు. తాజాగా ఓ ముఠా ఏకంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కే మస్కా కొట్టింది. ఎకౌంట్లో నుంచి దాదాపు రెండు లక్షల రూపాయలు దోచేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరు ప్రాంతానికి చెందిన మహిళ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లేందుకు మేక్ మై ట్రిప్ ద్వారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల టూర్ ను వాయిదా వేసుకున్నారు. జర్నీ చేయాల్సిన డేట్ మార్చుకునేందుకు మేక్ మై ట్రిప్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. నెంబర్ సంపాదించి ఫోన్ చేయగా.. కాల్ మధ్యలోనే కట్ అయింది. వెంటనే మరో నెంబర్ నుంచి ఆమె ఫోన్ కు కాల్ వచ్చింది.

    అటు వైపు నుంచి మాట్లాడిన వ్యక్తులు మేక్ మై ట్రిప్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని.. ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తామన్నారు. దీంతో వారిని నమ్మిన అధికారిణి.. తన సమస్య మొత్తం వారికి వివరించారు. మొత్తం నోట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. మీ మొబైల్ కు లింక్ పంపిస్తామని.. దాని ద్వారా జర్నీ డేట్ మార్చుకోవచ్చని సూచించారు. వెంటనే లింక్ మెసేజ్ రాగా.. ఆమె క్లిక్ చేశారు. దీంతో ఎకౌంట్ లోని రూ.1.63 లక్షలు మాయమయ్యాయి. వెంటనే స్పందించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఖాతా నుంచి ఏ వ్యాలెట్ కు డబ్బు వెళ్లిందో గుర్తించారు. వెంటనే వ్యాలెట్ ను స్తంభింపజేసి 1.50 లక్షల నగదును బాధితురాలికి ఇప్పించారు.

    ఇది చదవండి: ఇద్దరు కుర్రాళ్ల దగ్గర తన సీక్రెట్ బయటపెట్టిన మహిళ... ఆ తర్వాత ఏం జరిగిందంటే..



    ఆన్ లైన్ లావాదేవీలు జరిపేసమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. గతంలో కృష్ణాజిల్లాలోనే సీఎంఓ నుంచి ఫోన్ చేస్తున్నట్లు గ్రామవాలంటీర్లకు ఫోన్లు చేసి నగదు దోచేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని.. వెరిఫికేషన్ కోడ్ చెప్పాలని కొన్ని సైబర్ ముఠాలు అమాయకులకు వలవేస్తున్నాయి. వీరి గురంచి తెలిసిన వారు వాటిని వదిలేస్తుండగా.. తెలియనివారు ఓటీపీలు, పిన్ నెంబర్లు చెప్పి నష్టపోతున్నారు. తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు నగదు ఇప్పిస్తున్నారు. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే మాత్రం రికవరీ కష్టమవుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలలు అవగాహన తెచ్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: