అతనో రాక్షసుడిలా ప్రవర్తించాడు. అభం, శుభం తెలియని మైనర్లను పశువుల్ని కొట్టినట్లుగా కొట్టాడు. అందరూ చూస్తుండగా ఊరి మధ్యలోకి తీసుకొచ్చి పసివాళ్లను చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి చితకబాదాడు. సమాజంలో ఉన్నామా లేక ఇంకా అనాగరిక ప్రపంచంలో ఉన్నామో మర్చిపోయి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పశ్చిమ బెంగాల్(West Bengal)లో ఈ అమానవీయ ఘటన జరిగింది. మిడ్నాపూర్ (Midnapore)జిల్లాలోని గర్బెటా (Garbeta)పోలీస్ పరిధిలోని జబా గ్రామానికి చెందిన మైనర్లపై రబియాల్ఖాన్ అనే మానవమృగం తెగబడ్డాడు. పిల్లలు తప్పు చేశారో, చేయలేదో తెలుసుకోకుండానే వాళ్లపై దొంగతనం నెపం మోపి ఊరి జనం చూస్తుండగా నడిరోడ్డుపైకి లాక్కొచ్చాడు. చేతికి ఏది దొరికితే దాంతో అత్యంత దారుణంగా కొట్టాడు. గ్రామానికి చెందిన మైనర్లు ట్రాక్టర్ విడి భాగాలు(Tractor spare parts) దొంగిలించారని అనుమానించాడు. ఆ కోపాన్ని వారిపై చూపించాడు. ఊరి జనం అంతా చూస్తుండగా పసివాళ్లను కరడుగట్టిన నేరస్తుల్లా తాళ్లతో కట్టేసి కిందపడేసి కాళ్లతో తన్నడం, కర్రతో చితకబాదడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మైనర్లను చితకబాదిన రబియాల్ఖాన్ (Rabiul khan)అనే మానవమృగం ప్రవర్తించిన తీరును అక్కడ ఉన్న కొందరు సెల్ఫోన్(Cell phone)లో చిత్రీకరించి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
పిల్లల్ని చావబాదిన మానవమృగం..
ఒకరు, ఇద్దరు కాదు నలుగురు చిన్నారులను మానవత్వం మరిచిపోయి రబియాల్ఖాన్ దారుణంగా కొట్టిన విషయం పోలీసులకు తెలియడంతో గ్రామానికి చేరుకున్నారు. రబియాల్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ మానవమృగంపై పోలీస్ కేసు నమోదు చేశారు. రబియాల్ఖాన్ చేతిలో చావు దెబ్బలు తిన్న నలుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం గార్బెట్టా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చేయని నేరానికి బాలలకు శిక్ష..
రబియాల్ఖాన్కి చెందిన ట్రాక్టర్ విడి భాగాలు మాయవడంతో అక్కడే ఆడుకుంటున్న చిన్నారులే తీసి ఉంటారని అనుమానించాడు. వాళ్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకోమంటూ చితకబాదాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో పూర్తి వివరాలు రాబట్టారు. చిన్నపిల్లల్ని కొడుతుంటే చోద్యం చూస్తుండిపోయిన గ్రామస్తుల తీరును తప్పుపడుతున్నారు పోలీసులు. చిన్నారులపై దాష్టీకాన్ని ప్రదర్శించిన వ్యక్తిని వదలిపెట్టవద్దని..కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video, West Bengal