హోషంగాబాద్: సమాజంలో హిజ్రాలపై ఎంతటి చిన్నచూపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరైతే వాళ్లను కనీసం మనుషులగా కూడా గుర్తించకుండా పురుగును చూసినట్టు చూస్తారు. రైళ్లలో భిక్షాటన చేసుకునే కొందరు హిజ్రాల దురుసు ప్రవర్తన కూడా ట్రాన్స్‌జెండర్స్‌పై చిన్నచూపుకు ఒక కారణం. వాళ్లను మనుషులుగా గుర్తించకపోయినా పర్లేదు కానీ హీనంగా చూస్తూ వారిని ఇబ్బంది పెట్టడం కొందరు ఆకతాయిలకు పరిపాటిగా మారింది. వారిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ.. అసభ్యంగా ప్రవర్తిస్తూ కొందరు నీచానికి దిగజారుతున్నారు.
తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఓ హిజ్రాను ముగ్గురు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా అడ్డగించి నానా ఇబ్బంది పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ తాకుతూ తప్పుగా ప్రవర్తించారు.
ఆ హిజ్రా దగ్గర ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించారు. ఏదో ఘన కార్యం చేసినట్లు ఆ ఘటనను సెల్‌ఫోన్‌తో రికార్డ్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కనిపించిన యువకులు ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. ఆ వీడియోలో హిజ్రాపై చేయి చేసుకుని, తిట్టికొట్టి ఏడిపించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ హిజ్రా పేరు నేహా అని.. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుందని తెలిపారు. అలా ఆ ప్రాంతంలో ఉన్న అరుణ్ అనే యువకుడిని డబ్బులు అడగ్గా.. ఇవ్వకపోగా తన ఇద్దరు స్నేహితులైన హిమాన్షు, రాజేష్ జాదవ్‌తో కలిసి ఆ హిజ్రాపై దాడికి పాల్పడ్డాడు.
ఆమె చీర లాగి.. బుగ్గలు ఒత్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ హిజ్రా ఈ పెనుగులాటలో కిందపడిపోయింది. ఆమె దగ్గరున్న డబ్బును లాక్కున్నారు. తమ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని ఆ హిజ్రాను బెదిరించారు. ఈ ఘటన ఆగస్ట్ 23న జరిగిందని.. సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ వీడియోను ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో ఆ తర్వాత వీడియో వైరల్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Transgender, Trending news, Viral Video