వాలెంటైన్స్ డే రోజు వీరంగం.. రెస్టారెంట్‌, హుక్కా బార్‌పై శివసేన, బీజేవైఎం కార్యకర్తల దాడులు..

ప్రతీకాత్మక చిత్రం

వాలెంటైన్స్‌డే రోజు కొందరు బీజేపీ, శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పలు చోట్లు ప్రైవేటు ఆస్తులకు నష్టం చేకూర్చారు.

 • Share this:
  వాలెంటైన్స్‌డే రోజు కొందరు బీజేపీ, శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పలు చోట్లు ప్రైవేటు ఆస్తులకు నష్టం చేకూర్చారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. వాలంటైన్స్ డే రోజున భోపాల్‌లోని శ్యామల హిల్స్ ప్రాంతంలో బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు హుక్కా బార్ లాంజ్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. మరోవైపు శివసేన కార్యకర్తలు అరేరా కాలనీ ప్రాంతంలోని రెస్టారెంట్‌పై దాడి చేశారు. రెస్టారెంట్‌పై దాడికి పాల్పడిన శివసేన కార్యకర్తల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరందరిని అరెస్ట్ చేసినట్టు హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు. రెస్టారెంట్‌పై శివసేన కార్యకర్తలుగా చెప్పబడుతున్న వ్యక్తులు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  ఇక, శ్యామల హిల్స్ ప్రాంతంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్.. హుక్కా బార్లను, లాంజ్‌లపై తన వ్యతిరేకతను ప్రదర్శించారు. భోపాల్‌లో వివిధ ప్రాంతాల్లో హుక్కా బార్లను, లాంజ్‌లను మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై స్పందించిన బీజేవైఎం నాయకుడు అమిత్ రాథోడ్ మాట్లాడుతూ.. యువతులకు డ్రగ్స్ అందిస్తున్న, లవ్ జిహాద్‌కు ప్రోత్సహితస్తున్న హుక్కా బార్లకు ఇది ఒక ప్రారంభ హెచ్చరిక మాత్రేమనని చెప్పారు. రెస్టారెంట్‌, లాంజ్‌లో హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్‌తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు జోన్-3 అడిషనల్ ఎస్పీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు.

  వాలెంటైన్స్ డే రోజు చోటుచేసుకున్న రెండు ఘటనలకు సంబంధించి హబీబ్‌గంజ్, శ్యామల హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ఘటనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్‌తో పాటు మొత్తం 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: