లోదుస్తుల చోరీ విషయంలో చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ వ్యక్తి తన సహచర ఉద్యోగిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బహ్రయిచ్ జిల్లాలోని శుక్లా మొహల్లాకు చెందిన వివేక్, బండాలోని తిండవారి ప్రాంతావానికి చెందిన అజయ్ కుమార్ కాన్పూర్ జిల్లాలోని దేహట్ ప్రాంతంలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. వారిద్దరు కంపెనీ పరిసరాల్లోని ఒకే రూమ్‌లో నివాసం ఉంటున్నారు. అయితే అజయ్ అండర్వేర్ చోరీ చేసిన వివేక్.. దాన్ని ధరించాడు. ఈ విషయం తెలుసుకున్న అజయ్ తీవ్ర కోపంతో కత్తితో దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే వివేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు దేహట్కు చేరుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. "వివేక్‌తో అజయ్ తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా మిగతా వర్కర్లు చెప్పారు. ఈ క్రమంలోనే అజయ్ కూరగాయలు కోసే కత్తిని తీసుకుని వివేక్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వివేక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో మిగతా సహచరులు వివేక్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు అతని కాన్పూర్‌లోని లాలా లజపతి రాయ్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే వివేక్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు"అని పేర్కొన్నారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు అజయ్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అజయ్ కోసం గాలింపు చేపట్టారు. ఫ్యాక్టరీ ఓనర్, ఇతర ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై వారిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు.