అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఇక అబార్షన్ అనేదే జరగదు. కాదని ఎవరైనా చేశారో.. వారికి జీవితాంతం జైల్లో చిప్పకూడే. ఎందుకంటే, అబార్షన్‌ను నిషేధిస్తూ అక్కడి సెనేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాస్పద బిల్లును చర్చల అనంతరం సభ ఆమోదించింది. ఈ బిల్లును ఎంత కఠినంగా రూపొందించారంటే రేప్ బాధితులకు, వావి వరుసలు లేకుండా చేసే తప్పుల(ఇన్‌సెస్ట్) వల్ల వచ్చే గర్భాన్ని కూడా తొలగించుకోవడానికి అనుమతి లేదు. కేవలం తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితేనే అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఉంది. కాదని డాక్టర్లు అబార్షన్ చేస్తే 99 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. 25-6 ఓట్ల తేడాతో పాస్ అయిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ఆమె బిల్లుకు ఆమోదం తెలిపి చట్టం చేశారు. నిజానికి, 1973లో అమెరికన్ సుప్రీం కోర్టు అబార్షన్లను దేశవ్యాప్తంగా చట్టబద్దం చేసింది. అయితే కోర్టు తీర్పును సమీక్షించిన సెనేట్, దానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో విచ్చల విడిగా జరుగుతున్న అబార్షన్లపై దేశవ్యాప్తంగా మహిళలు, స్వచ్ఛంద సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథయంలో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, రేప్ బాధితులకు, ఇన్‌సెస్ట్ తప్పులకు చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని డెమోక్రాట్లు పట్టుబట్టినా ఆ సవరణ 11-21 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఈ బిల్లును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అత్యాచార బాధితులు గర్భస్రావం చేయించుకునేందుకు వీల్లేదనడం వారిని మరింతగా శిక్షించినట్లవుతుందని విరుచుకుపడుతున్నారు. కాగా, అబార్షన్ చట్టాన్ని ఎత్తివేస్తామని అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే, ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే ట్రంప్ అనేక సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. ప్రస్తుత సుప్రీంకోర్టు ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్నది. తొమ్మిది మంది సభ్యులు ఉండే సుప్రీంలో.. ట్రంప్ నియమించిన కన్జర్వేటివ్ జడ్జిలు ఎక్కువే ఉన్నారు. 1973 నాటి తీర్పును రద్దు చేయాలన్న ఉద్దేశంతో కన్జర్వేటివ్‌లు ఉన్నారు. దీంతో ఇప్పుడు అలబామాలో అబార్షన్‌పై నిషేధం విధించడం ఓ సంచలనంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, RAPE, Supreme Court, USA