ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశవ్యాప్తంగా సృష్టించిన నిర్భయ తరహా ఘటన తాజాగా యూపీలో చోటుచేసుకుంది. హథ్రాస్ దారుణ ఘటన మరువక ముందే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మరో నిర్భయ లాంటి దారుణ ఘటన జరిగింది. యూపీలోని బదూన్ జిల్లా ఉఘాటి ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. 50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి..ఆమెను హత మార్చారు. బాధితురాల్ని చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైన విషయాలు మృగాళ్ల క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఈ నెల 3 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మేవాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రైవేటు భాగాల్లో ఐరన్ రాడ్డుతో దాడి చేసి.. పక్కటెముకలు, కాలు విరిగేలా పశువుల్లా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితురాలి ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయ్. తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కన్ను మూసింది.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు హంత్ బాబా సత్యనారాయణ, అతడి అనుచరుడు వేద్‌రాం, డ్రైవర్ జస్పాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కనుగొనేందుకు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. బదూన్ ఎస్‌ఎస్పీ సంకల్ప్ శర్మ ఘటనాస్థలిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం ఉందని తెలుస్తోంది. బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేసినా, సకాలంలో స్పందించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్‌ను బదౌన్ ఎస్పీ సస్పెండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Gang rape, Nirbhaya, UP police