news18-telugu
Updated: November 22, 2020, 6:47 AM IST
ప్రతీకాత్మక చిత్రం
సెటాప్ బాక్స్ రీచార్జ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి మహిళా డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ఇద్దరు పిల్లలపై కూడా దాడికి పాల్పడ్డాడు. అయితే వారిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాలు.. 38 ఏళ్ల దంత వైద్యురాలు నిషా సింఘాల్ తన భర్త అజయ్ సింఘాల్, ఇద్దరు పిల్లలతో ఆగ్రాలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సెటాప్ బాక్స్ రీచార్జ్ పేరిట శుభమ్ పాథక్ అనే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అజయ్ హాస్పిటల్లో ఉన్నారు. నిషా పిల్లలు ఇంట్లోని వేరే గదిలో ఉన్నారు. ఇదే అదనుగా శుభమ్ కత్తితో నిషా గొంతు కోశాడు. ఆ తర్వాత ఆమె పిల్లలపై కూడా దాడి చేశాడు. నిషాను హత్య చేసిన తర్వాత అతడు దాదాపు గంటపాటు అక్కడే ఉన్నాడు. ఇంట్లోని బంగారం, డబ్బు దోచుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటన గురించి తెలిసిన నిషా భర్త ఇంటికి చేరుకుని భార్యను, పిల్లలను ఆస్పత్రికి తరలించాడు. అయితే తీవ్ర గాయాలు కావడంతో నిషా మృతిచెందారు. ప్రస్తుతం పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శుభమ్‌ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది.
ఈ క్రమంలో నిందితుడు శుభమ్‌కు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక, కేబుల్ టీవీ టెక్నీషియన్ అని చెప్పి శుభమ్.. నిషా ఇంటికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్లిన అతడు అందుకు అడ్డుగా ఉన్న నిషాను హత్య చేసినట్టు చెప్పారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆగ్రాలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఓ మహిళాను గొంతుకోసి హత్యచేయడం రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసింది. అవినీతి అధికారులను కాపాడటంలో, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంలో బీజేపీ ప్రభుత్వం బీజిగా ఉంది. టీవీ ప్రకటనలు ఇవ్వడానికి బదులు, రాష్ట్రంలో నేరాలు ఎలా తగ్గించాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి"అని అఖిలేశ్ ట్వీట్ చేశారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 22, 2020, 6:47 AM IST