ఓ 17 ఏళ్ల బాలికకు ఆమె తల్లిదండ్రులు బలవంతపు వివాహం చేశారు. డబ్బులకు ఆశపడి బాలిక మేనమామ ఈ వివాహం జరిపించాడు. కానీ అత్తారింట్లో కాలిపెట్టిన ఆమెపై భర్తతో పాటు, ఇతర కుటుంబ సభ్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలిక చివరకు.. ఓ రైలు ఎక్కి అక్కడి నుంచి పారిపోయింది. అయితే బాలిక స్థితిని గుర్తించిన ఓ వ్యక్తి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను రక్షించారు. అనంతరం ఆమె శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. అయితే తనపై జరిగిన దాడితో షాక్‌లోకి వెళ్లిపోయిన బాలికకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో కొంతమేర బాలిక తనకు జరిగిన దారుణం గురించి వారికి వివరించింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ డియోరియాలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న బాలిక ఇష్టానికి విరుద్దంగా ఆమె మేనమామ పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఆమె తల్లిదండ్రులు కూడా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లికి అంగీకరించారు. దీంతో గతేడాది నవంబర్ 30న బాలిక అక్కడికి సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది.
అనంతరం బాలిక అత్తారింటికి వెళ్లింది. అక్కడ ఆమె భర్తతో పాటు అతని సోదరులు, సోదరీమణుల భర్తలుకూడా అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఆమె భర్తకు, మామకు తెలియజేసింది. అయితే వారు దానిని పట్టించుకోలేదు. బాలికను ఆమె తల్లిదండ్రులకు డబ్బులిచ్చి కొనుగోలు చేసినట్టు చెప్పారు. వారు చెప్పినట్టు చేయాలని ఆదేశించారు. అయితే ఇందుకు బాలిక నిరాకరించింది.
దీంతో బాలికను ఆమె భర్త, మామ ఇద్దరు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి బంధించారు. అక్కడ ఇతర కుటుంబ సభ్యులు పలమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో వారు తన వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బాలిక తెలిపింది. ఇక, అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక డియోరియోలోని తన మేనమామ ఇంటికి వెళ్లింది. తన భర్త, అత్తమామలపై కేసు పెట్టాలని అతడిని కోరింది. కానీ అతడు బాలికను కేసు పెట్టకుండా అడ్డుకున్నాడు.
దీంతో మేనమామ తనకు సాయం చేయడానికి సిద్దంగా లేడని అర్థం చేసుకున్న బాలిక ఏప్రిల్ 7వ తేదీన అక్కడి నుంచి పారిపోయింది. మరసటి రోజు రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కింది. Gorakhpur Avadh Expressలో బాలిక రాజస్తాన్‌లో కోటాకి చేరుకుంది. టికెట్ లేనట్టు టికెట్ ఎగ్జామినర్ గుర్తించారు. ఆమె ఇంటి నుంచి పారిపోయి వచ్చిందేమోనన్న అనుమానించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను రక్షించి సీడబ్ల్యూసీకి అప్పగించారు. అక్కడ బాలిక నుంచి వివరాలు తెలుసుకున్న సీడబ్ల్యూసీ అధికారులు.. నిందితులపై కేసు నమోదు చేయాలని యూపీ అధికారులకు లేఖ రాశారు. బాలికను షెల్టర్ హోమ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.