రేప్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు జీవితఖైదు...

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్

ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు చెప్పింది.

  • Share this:
    ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితురాలికి ప్రాణభయం ఉంటే ఆమెకు రక్షణ కల్పించాలని, బాధితురాలు, ఆమె కుటుంబం ఉండడానికి సురక్షితమైన నివాసం ఏర్పాటు చేయాలని సీబీఐని తీస్ హజారీ కోర్టు ఆదేశించింది. 2017 నాటి ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తీస్ హజారీ కోర్టు ఈనెల 16న కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. అనంతరం దోషికి జీవిత ఖైదు శిక్షను ఈరోజు ఖరారు చేసింది. సెంగార్ మీద అత్యాచారం కేసు, బాలిక మీద లైంగిక దాడి కేసు, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2017లో అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్ కావడంతో కుల్దీప్ సెంగార్ మీద పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

    అసలు ఏం జరిగింది?
    కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటూ 17 ఏళ్ల యువతి, తన కుటుంబసభ్యులతో కలసి ఆయనను కలిసింది. అయితే, ఈ సందర్భంగా తన మీద ఎమ్మెల్యే, మరికొందరు గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలు ఆరోపించింది. 2017 జూన్ 4న ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కుటుంబసభ్యులు కూడా తన మీద దాడి చేశారని ఆరోపించింది. ఈ కేసు పెను దుమారానికి దారితీసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ క్రమంలో నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది.

    ఆందోళనలు మిన్నంటడంతో ఈ కేసులను యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ రెండు చార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. అందులో కుల్దీప్ సింగ్ సెంగార్‌‌ను నిందితుడిగా చేర్చింది. ఈ క్రమంలో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్దే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి చనిపోయాడు. మరోవైపు బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు బెదిరింపులు పెరిగిపోవడంతో వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో కేసు విచారణను ఢిల్లీకి మారుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా 2019 జూలైలో కూడా బాదితురాలు, ఆమెతరఫు న్యాయవాది కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: