విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ ప్రొఫెసర్ బుద్ది వక్రమార్గం పట్టింది. వాట్సాప్ వేదికగా విద్యార్థినిని వేధింపులకు గురిచేశాడు. ఆమె ముక్కు బాగుందంటూ అసభ్యకరంగా మెసేజ్‌లు పంపిచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఎంఫిల్ ప్రవేశం కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థినితో వాట్సాప్‌లో చాట్ చేశాడు. ఎగ్జామ్స్‌కు సంబంధించిన సలహాల గురించి విద్యార్థిని ప్రొఫెసర్‌ను సంప్రదించింది. దీన్ని అదనుగా తీసుకున్న పెళ్లి కానీ ఆ ప్రొఫెసర్.. విద్యార్థినితో చాట్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే "నీ ముక్కు చాలా అందంగా ఉంటుంది. నీలాంటి అందమైన అమ్మాయితో స్నేహం చేయకూడదని ఎవరు కోరుకుంటారు. నువ్వు కొంచెం బరువు తగ్గాలి. అయితే నువ్వు లావుగా ఉన్నా బాగానే ఉంటావు. నీ డిస్ప్లే పిక్చర్‌ను మార్చకూడదు.." అని ప్రొఫెసర్ విద్యార్థినితో చాట్ చేశాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో విద్యార్థినులను సాయం చేసేందుకు ప్రొఫెసర్లు వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక, ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థులు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అతని కేసు పెట్టి విచారణ జరపాలని అన్నారు. ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రొఫెసర్ ప్రయత్నిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అందించాలని సీసీఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ కె బాలజీ ఆదేశించారు.