(K.Veeranna,News18,Medak)
అమాయకపు ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయడానికి కామాంధులు కాచుకొని కూర్చుంటున్నారు. తెలిసి, తెలియని వయసులో ఉన్న ఆడపిల్లల్ని బంధువుల పేరుతో దగ్గరై రాబంధుల్లా పీక్కు తింటున్నారు. బయటకు నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్లలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకొని ఆశ పెంచుతున్నారు. అమ్మాయితో వాట్సాప్ చాటింగ్ (WhatsApp Chatting)చేసి వాళ్ల బలహీనతలపై దెబ్బ కొడుతున్నారు. ఎవరూ లేని సమయం చూసి ఆ కోరిక తీర్చుకొని గర్భవతుల్ని చేస్తున్నారు. మెదక్(Medak)జిల్లాలో ఓ ఆటోడ్రైవర్ (Autodriver) మామయ్య(Uncle)బంధుత్వం అడ్డుపెట్టుకొని అమాయికపు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు.
మామయ్య కాదు కామాంధుడు..
సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోతోంది. చుట్టూ జనం ఉన్నారనే ఇంగితజ్ఞానం లేదు. నేరం చేస్తే కఠినమైన శిక్ష పడుతుందనే భయం పోవడంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అనవసరంగా ఆడపిల్లల జీవితాల్ని కాలరాస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన పంజారాజు అనే పాతికేళ్ల యువకుడు ఆటో నడుపుకుంటున్నాడు. తనకు వరసకు కోడలు అయ్యే 16బాలికతో చనువు పెంచుకున్నాడు. బంధువు కదా అని ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో మరింత బరితెగించాడు. ఆ మైనర్ బాలికతో వాట్సాప్ చాటింగ్ చేస్తూ తన మాయ మాటలతో లొంగదీసుకున్నాడు రాజు.
కోడలి వరసయ్యే బాలికపై ..
పైకి బాగా మాట్లాడుతూ...బంధువు కూడా కావడంతో అమ్మాయి అతను చెప్పినట్లుగా చేసింది. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని...పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి కాకుండానే మైనర్ బాలికను పలుమార్లు శారీరకంగా వాడుకోవడంతో ...ఆమె గర్భవతి అయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెబితే ఏం చేస్తారోననే భయంతో రహస్యంగా ఉంచింది. అమ్మాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో పాటు శరీరంలో మార్పును గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది.
సభ్యసమాజం సిగ్గుపడే ఘటన..
ఆటో డ్రైవర్ పంజారాజు తనను లోబర్చుకున్నాడని..పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసినట్లుగా తెలిపింది బాధితురాలు. మైనర్ బాలిక చెప్పిన విషయంతో కడుపు రగిలిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే నిజాంపేట పోలీస్ స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కంప్లైంట్ ఆధారంగా రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మామయ్య బంధుత్వంతో ఓ కామాంధుడు మైనర్ బాలిక జీవితాన్ని పాడు చేసిన ఘటన బయటి ప్రపంచానికి తెలిస్తే పరువు పోతుందనే భయంతో కుటుంబ సభ్యులు అవమానంతో కుంగిపోతున్నారు. నిందితుడ్ని వదిలిపెట్టవద్దని పోలీసులకు వేడుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.