రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ దారుణ హత్యోదంతం (Udaipur Murder case)పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో తొలిసారి ఐసిస్ తరహాలో తల నరికేసిన కేసు కావడంతో ఇది ఉగ్రచర్యే అనే అనుమానాల నేపథ్యంలో ఉదయ్ పూర్ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కన్హయ్యను 26 సార్లు నరికినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది.
ఉదయ్‌పూర్ లో మంగళవారం నాడు చోటుచేసుకున్న కిరాతక కాండలో కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా చంపేశారు. నిందితులను మహమ్మద్ రియాజ్ అక్తర్, మహమ్మద్ ఘోష్‌గా గుర్తించారు. మహ్మద్ ప్రవక్తపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతుగా పది రోజుల క్రితం కన్హయ్యాలాల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టిన క్రమంలో ఈ దురాగతం చోటుచేసుకుంది.
కన్హయ్యలాల్ హత్య నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. రాబోయే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మతఛాందస్సవాద ఉగ్రసంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపాయి. 10 మందికిపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్‌ను దుండగులు పదునైన కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. కాగా ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యా లాల్ స్వస్థలం మల్దాస్ ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ కన్హయ్య అంతిమ యాత్రకు జనం పోటెత్తారు. పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా వచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rajasthan