Telangana: అన్నం పెట్టిన వృత్తే ఆయువు తీసింది.. కరెంట్ షాక్ కు గురై ఇద్దరి మృతి

మృతదేహం వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు

మనం పెంచినవారే మనను తరిమేసినట్టు.. మనం పెంచుకున్న జంతువే మనమీద దాడి చేసినట్టు.. మనకు అన్నం పెట్టిన వృత్తే.. మన ఆయువును తీసినట్టు జరిగితే..! జరిగింది. ఇన్నాళ్లు అడవి పందులను వేటాడమే వాళ్ల వృత్తి. కానీ వాటిని వేటాడే క్ర‌మంలో ఇద్దరు యువ‌కులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  విధి బలీయమైనది. అది ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి తలరాతలు మార్చుతుందో ఎవరూ ఊహించలేరు. ఏమీ కాదనుకుని ముందడుగు వేసే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెప్పపాటు క్షణంలో ప్రాణాలు దక్కించుకునే వారు కొందరైతే.. అదే సమయంలో ప్రాణాలు పోయేది కొంత మంది. మనం పెంచినవారే మనను తరిమేసినట్టు.. మనం పెంచుకున్న జంతువే మనమీద దాడి చేసినట్టు.. మనకు అన్నం పెట్టిన వృత్తే.. మన ఆయువును తీసినట్టు జరిగితే..! జరిగింది. ఇన్నాళ్లు అడవి పందులను వేటాడమే వాళ్ల వృత్తి. కానీ వాటిని వేటాడే క్ర‌మంలో ఇద్దరు యువ‌కులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

  తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. దూప‌ల్లి గ్రామానికి చెందిన కౌలురైతు పోతరాజు నవీన్ రబీ సీజన్ కోసం కౌలుకు తీసుకున్న పొలంలో నారుమడి పోశాడు. పంట‌ల‌ను అడ‌వి పందులు నాశనం చేస్తున్నాయి. దీంతో ఆ రైతు త‌న నారుమ‌డిని కాపాడుకోవాడానికి కరెంటు తీగలను బిగించాడు. ఇదిలాఉండగా.. అడవి పందులను వేటాడేందుకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు.. పందిని బ‌రిష‌తో పొడవడంతో అది వారి నుండి తప్పించుకునేందుకు పరుగు తీసింది. నవీన్ పొలం వద్దకు రాగానే పంది స్పృహతప్పి పడిపోయింది.

  దీంతో ఆ యువకులు అడవి పంది చిక్కినట్టే అనుకున్నారు. దానికి దగ్గరగా వెళ్లారు. పంది కదలడం లేదు. ఇంకో క్షణమైతే దాన్ని పట్టుకోని వెళ్లిపోయేవాళ్లే. కానీ విధి వారి తలరాతను మరోలా రాసింది. వాళ్లిద్దరూ అక్కడకు రాగానే.. అడవి పందిని పట్టుకునేందుకు వెళ్లగా.. అక్కడే నవీన్ బిగించిన క‌రెంట్ తీగలు షాక్ కొట్టాయి. దీంతో ఆ యువకులు అక్కడికక్కడే కిందపడిపోయారు. ఎటు చూసినా ఆదుకునే నాదుడు లేదు. ఎవరిని పిలుద్దామన్నా.. నోటి నుంచి మాట రావడం లేదు. రోడ్డు ప్రమాదాలో.. మరేదో అయితే కొంతసేపు బతికేవారేమో.. కానీ వాళ్లు పట్టుకున్నది కరెంటు తీగను. అది పెద్దగా టైం ఇవ్వదు. చూస్తుండగానే ఆ ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు.

  తెల్లవారుజామున పొలానికి వ‌చ్చిన ఆ రైతుకు ఇద్దరి మృతదేహాలు క‌నిపించాయి. దీంతో భయపడిపోయి స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న‌ రెంజల్ ఎస్సై సాయినాథ్ గ్రామానికి చేరుకుని మృతుల వద్ద ఆధారాలు సేక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వారి వ‌ద్ద ఎలాంటి ఆదారాలూ లభించలేదు. పొలానికి కొద్దిదూరంలో వేటాడిన అడవి పంది కొన ఊపిరితో పడి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. చనిపోయిన వారిద్దరూ పందుల వేటకు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు.. బోధన్ ఏసిపి రామారావు, టౌన్ ఎస్ఐ రామన్ లు సంఘటనా స్థలాన్ని ప‌రిశీలించారు. యువకుల మృతదేహాన్ని బోధన్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఇద్దరు యువకులు మృతి కి కారణమైన కౌలురైతు నవీన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సుమారు 28 నుంచి 30 యేళ్ల వ‌య‌సు ఉన్న ఆ యువ‌కుల‌ ఆచూకి గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.
  Published by:Srinivas Munigala
  First published: