లఖింపూర్ ఖేరి: మృత్యువు ఎప్పుడు.. ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. అది సమీపించిన రోజున అప్పటి దాకా ఉన్న సంతోషం, ఆనందం ఆవిరైపోతుంది. మన వాళ్లను మనకు దూరం చేస్తుంది. వారి మృతదేహాన్ని శ్మశానానికి పంపుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబంలో మృత్యువు ఊహించని విషాదాన్ని నింపింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఆ కుటుంబానికి దూరం చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇద్దరినీ మృత్యువు కబళించివేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రానా ప్రాంతంలో అనురాగ్ రస్తోగి కుటుంబం నివాసం ఉంటోంది. అనురాగ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. అనురాగ్ కుటుంబం దేవ్‌కాళిలోని పురాతన శివాలయానికి వెళ్లి.. ఆ పరమ శివుణ్ణి దర్శించుకునేందుకు బయల్దేరింది. అనురాగ్ రస్తోగి తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులతో కలిసి ఓ ఆటోలో దేవ్‌కాళికి బయల్దేరాడు. అనురాగ్ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు మాత్రం స్కూటీపై.. వీళ్లు వెళుతున్న ఆటో ముందు వెళ్తున్నారు. తన ఇద్దరు సిస్టర్స్ వెనక కూర్చుని ఉండగా.. అనురాగ్ కొడుకు వివేక్ స్కూటీ నడుపుతున్నాడు.
తోడబుట్టిన ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సరదగా వెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వీళ్లు వెళుతున్న స్కూటీని ఢీకొట్టింది. లారీ ఢీ కొట్టడంతో స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై ఎగిరి పడ్డారు. వెనక కూర్చున్న ఇద్దరమ్మాయిలకు తీవ్రంగా గాయమై రక్తస్రావం కావడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అక్కాచెల్లెళ్లయిన నీతూ, అవంతిక రోడ్డుపై విగత జీవులుగా పడి, వారికి కొంత దూరంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ వివేక్ పడి ఉండటాన్ని చూసి అనురాగ్ కుటుంబం నిర్ఘాంతపోయింది. ‘అయ్యో.. భగవంతుడా.. ఎంతపని జరిగిందంటూ.. ఆటో దిగి వారి వద్దకు వెళ్లారు. అవంతిక, నీతూ ఇద్దరు అప్పటికే చనిపోయారు.
తీవ్రంగా గాయపడి ప్రాణం దక్కించుకోవడానికి పోరాడుతున్న వివేక్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్కూటీపై వెళుతున్న కొడుకు, ఇద్దరు కూతుర్లను ఆ లారీ ఢీకొట్టడాన్ని వెనుక ఆటోలో వస్తున్న అనురాగ్ కుటుంబం చూసింది. కళ్ల ముందే తమ ఇంట్లో మనుషులు నేలరాలుతుంటే చూసి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న వివేక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత.. మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలించారు. చనిపోయిన ఆ అక్కాచెల్లెళ్ల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. దైవ దర్శనానికి వెళుతుంటే మృత్యువు ఎదురు రావడమేంటని ఆ కుటుంబం కన్నీరుమున్నీరయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike accident, Crime news, Road accident, Two died, Uttar pradesh