కేసీఆర్ సర్కారు భూముల ధరలను పెంచుతూ వరుస జీవోలు ఇచ్చిన తర్వాత తెలంగాణ అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత జోరందుకుంది. అయితే హైదరాబాద్ శివారులో కొనసాగుతోన్న రియాలిటీ వ్యాపారంలో మాత్రం మాఫియా కలాపాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో మరోసారి రక్తపాతం చోటుచేసుకుంది. ఇది సుపారీ గ్యాంగ్ పనే అని అనుమానాలున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనా స్థలిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. వివరాలివి..
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద మంగళవారం కాల్పులు కలకలం సృష్టించాయి. స్కార్పియో కారులో వెళ్తున్న ఇద్దరు రియల్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియల్టర్ నవార్ శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రియల్టర్ల జంట హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చనిపోయిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కలిసి ఇబ్రహీంపట్నం పరిధిలోని లేక్ వ్యూస్‌కు సమీపంలో వెంచర్ వేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. ఆ వెంచర్ విషయమై మాట్లాడేందుకు ఇవాళ కారులో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా,
భూవివాదాలే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు మట్టారెడ్డి అనే మరో వ్యక్తితో కలిసే పటేల్‌గూడలో 22 ఎకరాల్లో ఓ వెంచర్ వేశారు. ఈ వెంచర్ విషయంలో మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. మట్టారెడ్డి పిలవడం వల్లే ఇవాళ శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు ఇంటి నుంచి బయలుదేరారు.
భూ వివాదాల నేపథ్యంలో మట్టారెడ్డే మిగతా ఇద్దరిపై కాల్పులు జరిపినట్లు మృతుల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస రెడ్డి కొన్న భూమిలో వాటా కోసం మట్టారెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సెటిల్మెంట్ కోసం పిలిచి మట్టారెడ్డే ఇద్దరినీ ఖతం చేయించి ఉంటాడనీ పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. కాల్పులు జరిపింది సుపారీ గ్యాంగ్ అయి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. దీంతో మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. త్వరితగతిన దర్యాప్తు చేసి నిజాలు రాబడుతామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Murder case, Rangareddy, Real estate, Real estate in Hyderabad