ఊహించని షాక్.. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదువుకొమ్మని భార్యలను విదేశాలకు పంపిన ఆ ఇద్దరు భర్తలకు..

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి వరకు భార్యలను మోసం చేసిన భర్తల గురించే మీరు వార్తలను విని ఉంటారు. చదివి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ అత్యాశకు పోయిన భర్తలే బాధితులుగా మిగిలారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

 • Share this:
  అస్సలు ఏమాత్రం కష్టపడకుండా విదేశాలకు వెళ్లే ఛాన్స్ వస్తోందంటే, అక్కడే ఉండేలా అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పాపం ఆ ఇద్దరు మగాళ్లు కూడా అదే ఆశపడ్డారు. ఆ పరీక్ష, ఈ పరీక్ష అని రాసి, ఇంటర్వ్యూలకు హాజరయి కాలేజీలో సీటో, ఉన్నతోద్యోగమో తెచ్చుకుంటేనే విదేశాల్లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. అబ్బే, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదనుకున్న ఆ కుర్రాళ్లు మాత్రం రూటు మార్చారు. షార్ట్ కట్ ను వెతుక్కున్నారు. చివరకు బొక్కబోర్లా పడ్డారు. లక్షలకు లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు భార్యలను మోసం చేసిన భర్తల గురించే మీరు వార్తలను విని ఉంటారు. చదివి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ అత్యాశకు పోయిన భర్తలే బాధితులుగా మిగిలారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కొడుకు అయిన రాకేష్ కుమార్ ఓ రోజు తన ఇంటికి ఓ యువతిని తీసుకొచ్చాడు. ఆమెతోపాటు ఆమె తండ్రి కూడా ఉన్నాడు. ‘నాన్నా, ఈ అమ్మాయి బాగా చదువుకుంది. అన్ని పరీక్షలు రాసింది. పూర్తి చేసింది. విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ డబ్బుల్లేవు. మనం కనుక డబ్బును ఏర్పాటు చేస్తే ఆమె విదేశాలకు వెళ్లి చదువుకుంటుంది. ఆమె ద్వారా నేను కూడా విదేశాలకు వెళ్లొచ్చు. ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆరు నెలల తర్వాత తిరిగి భారత్ కు వస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత జీవిత భాగస్వామి వీసాతో నేను కూడా ఆస్ట్రేలియాకు వెళ్తా. అక్కడే బతుకుతాం‘ అని రాకేష్ కుమార్ తన తండ్రితో చెప్పాడు. ఇదేదో బాగానే ఉంది కదా అని దాదాపు 12 లక్షల రూపాయలను ఆ పోలీసు అధికారి వాళ్లకు ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ఆ యువతి కూడా ఆస్ట్రేలియాకు వెళ్లింది.

  2020వ సంవత్సరం జనవరి 20న భారత్ కు వచ్చి రాకేష్ ను పెళ్లాడింది. మళ్లీ ఫిబ్రవరి నెలలోనే ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత రాకేష్ తో మాట్లాడటం మానేసింది. జీవిత భాగస్వామి వీసాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తుందనుకుంటే ఇలా జరుగుతోందేంటని ఆమె తండ్రిని నిలదీశాడు. దీంతో, అతడు మరో పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. తాము మోసపోయామని గ్రహించిన రాకేశ్ కుమార్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా అచ్చం ఇలాంటి ఘటనే బర్నాలా నగరం పరిధిలోని బ్యాంక్ కాలనీలో జరిగింది. హర్వీందర్ సింగ్ అనే వ్యక్తి కూడా తన భార్య చేతిలో మోసపోయాడు. 2018వ సంవత్సరం మార్చి 24న మన్ ప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లాడాడు. 24 లక్షల రూపాయలు ఖర్చు చేసి భార్యను కెనడాకు పంపించాడు. జీవిత భాగస్వామి వీసాతో కెనడాకు తీసుకెళ్తానని ఆమె కూడా చెప్పింది. కానీ ఆ తర్వాత భర్తను మోసం చేసింది. దీంతో ఆ భర్త తన భార్య కుటుంబసభ్యులందరిపైనా కేసు పెట్టాడు. పోలీసులు ఈ రెండు ఘటనల్లోనూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: