సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం మోసాలను ఎంచుకుంటున్నారు. ఇంతకు ముందు హ్యాకింగ్, వివిధ రకాల బ్యాంకింగ్ మోసాలతో డబ్బు కాజేసేవారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరడగంతో ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో రూ.కోట్లలో దండుకుంటున్నారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ఫ్రెండ్షిప్ క్లబ్’ కుంభకోణం ఒకటి బయటపడింది. సామాన్యులకు మాయమాటలు చెబుతూ రూ.1.54 కోట్లు వసూలు చేశారు ఇద్దరు వ్యక్తులు. ఇప్పటి వరకు 2,500 మంది వీరి వలలో పడ్డారు. తాజాగా ఈ ఇద్దరు నేరస్తులను అహ్మదాబాద్ సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. 2015-2021 మధ్య గుజరాత్‌లోని వివిధ నగరాల్లో వీరి కార్యకలాపాలు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.
అహ్మదాబాద్‌లోని జగత్పూర్ ప్రాంతానికి చెందిన సహేదేవ్ జడేజా (30), జమాల్పూర్ నివాసి రాహుల్ బారియా(25) ఇద్దరు కొన్నేళ్లుగా నకిలీ ఫ్రెండ్షిప్ క్లబ్‌ను నడుపుతున్నారు. నిరుద్యోగ యువతను వీరు టార్గెట్ చేస్తారు. నిందితులు ఇద్దరూ 2015లో “ఆన్లైన్ ఎర్న్ మనీ” అనే క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో చేరినవారు మహిళలతో సెక్సువల్ రిలేషన్లో ఉంటూ, డబ్బు సంపాదించవచ్చని నమ్మిస్తారు.
ముందు ఆన్లైన్ ఎర్న్ మనీ సంస్థలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని నిందితులు ప్రకటనలు ఇచ్చేవారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగించాలని చెబుతారు. నిబంధనల ప్రకారం ఆ మహిళలే బాధితులకు డబ్బు చెల్లిస్తారని నమ్మించేవారు. ఇందుకు వివిధ రకాల ఫీజుల పేరుతో బాధితుల నుంచి డబ్బు వసూలు చేసేవారు.
డబ్బు చెల్లించిన తరువాత, నిందితులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేవారు. ఇలా రూ. 43,500 వరకు చెల్లించి మోసపోయిన ఒక వ్యక్తి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేయగా, నకిలీ క్లబ్ కుంభకోణం బయటపడిందని అహ్మదాబాద్ రూరల్ సైబర్ క్రైమ్ సెల్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్లు, ఏడు డైరీలు, 19 ఏటీఎం కార్డులు, ఐదు ఆధార్ కార్డులు, ఏడు చెక్ బుక్స్, ఐదు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అందరు బాధితుల వివరాలను ఈ డైరీల్లో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈజీ మనీ, ఆన్లైన్ మనీ పేరుతో వచ్చే మెస్సేజ్‌లు, పత్రికా ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Crime news, CYBER CRIME