హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసికందులు ఇద్దరు ఇంక్యూబేటర్ వేడికి కాలి చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఇంక్యుబేటర్‌లో అధికవేడికి చర్మం కాలి.. ఉడికి.. అత్యంత హృదయవిదారక స్థితిలో శిశువులు చనిపోయిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివే..
హైదరాబాద్ మెహిదీపట్నం ఏసీగార్డ్స్‌కు చెందిన సోఫియాబేగం, పాతనగరంలోని నవాబ్‌సాబ్ కుంటకు చెందిన మరో మహిళ సోమవారం ప్రసవం నిమిత్తం షంషీర్‌గంజ్‌లోని కేఏఎం ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం సోఫియాకు మగబిడ్డ పుట్టగా.. మరో మహిళకు ఆడశిశువు జన్మించింది. ఉదయం 9 గంటలకు ప్రసవమైనా.. 11.30 దాకా ఆ తల్లులకు బిడ్డలను చూపలేదు. ఏమైందని బంధువులు ప్రశ్నించగా..
శిశువులు ఇద్దరూ తక్కువ బరువుతో పుట్టారని, అదీగాక ఇద్దరికీ శ్వాస ఇబ్బందులున్నాయని, అందుకే ఇంక్యుబేటర్ లో పెట్టి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి సిబ్బంది బదులిచ్చారు. అయితే, కొద్ది సేపటి తర్వాత డాక్టర్లు, నర్సులు, సిబ్బంది హడావుడిగా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టారు. ఏం జరిగిందని ఇద్దరు బాలింతల తరఫు బందువులు అడగ్గా.. ఇంక్యుబేటర్ వేడికి పిల్లలు చనిపోయిన విషయం చెప్పకుండా.. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించిందని, పిల్లలకు సంబంధించిన పెద్దాసుపత్రి అయిన ప్రిన్సెస్ దుర్రేషెవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు.
దీంతో ఇద్దరు బాలింతల బంధువులు ఆందోళనగానే శిశువుల్ని తీసుకొని ఫత్తర్ గట్టీలోని దుర్రేషెవర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే శిశువులిద్దరూ చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. శిశువుల శరీరాలు కాలిపోయి ఉండికిపోయి ఉండటాన్ని గమనించినట్లు దుర్రేషెవర్ డాక్టర్లు చెప్పడంతో బాధితులు తిరిగి కేఏఎం ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు.
Sedition Law: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు.. రాజద్రోహ చట్టం నిలిపివేత.. మోదీ సర్కార్ యూటర్న్‌తో..
కేఏఎం ఆస్పత్రి వారు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ కేస్ షీట్లు, రిజిస్టర్‌లోని వివరాలను చించేశారని బాధితులు తెలిపారు. ‘శిశువులను ఇంక్యుబేటర్‌లో పెట్టిన సిబ్బంది ఆ తర్వాత పట్టించుకోలేదు. దాంతో.. వేడిని తట్టుకోలేక చిన్నారులు చనిపోయారు. వారి ఛాతీ, ఇతర శరీర భాగాలపై కాలిన గా యాలు ఉన్నాయి’ అని సోఫియాబేగం తరఫు బంధువులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేఏఎం ఆస్పత్రి యజమా ని డాక్టర్ మోయిజ్, వైద్యులు డాక్టర్ అలీనా అబ్బాస్, డాక్టర్ ఖాజా అబ్దుల్ ముఖీద్‌లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hospitals, Hyderabad, Hyderabad police, New born baby, Telangana