TWO MEN BOOKED FOR CHEATING PEOPLE IN THE NAME AYODHYA RAM TEMPLE FUND COLLECTION MS
Ram Temple Funds: రాముడి పేరు చెప్పి భక్తులకు పంగనామం.. అందినకాడికి దోచుకుంటున్న మోసగాళ్లు
ప్రతీకాత్మక చిత్రం
Ayodhya Ram Temple Funds Collection: అయోధ్యలో తలపెట్టిన రామ మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులు వారికి తోచినంతగా విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనినే ఆసరాగా తీసుకుని నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు.
దేశంలో భక్తి మాటున జరిగే మోసాల గురించి చాలా చూస్తున్నాం. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరిట మరోసారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. అయోధ్యలో తలపెట్టిన రామ మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులు వారికి తోచినంతగా విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనినే ఆసరాగా తీసుకుని నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పేరు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అచ్చం రామ మందిర్ ట్రస్ట్ వెబ్ సైట్ మాదిరిగానే కొత్త వెబ్ సైట్ ను తయారుచేసి.. అందులో బ్యాంకు వివరాలు, క్యూ ఆర్ కోడ్ ను జత చేశారు. ఆ క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి విరాళాలు పంపాల్సిందిగా భక్తులను కోరారు. దీంతో చాలా మంది భక్తులు ఇది నిజమైన రామమందిర ట్రస్టు వెబ్ సైట్ అనుకుని నగదు బదిలీ చేస్తూ మోసపోతున్నారు.
కాగా.. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను తేజ్వీర్ సింగ్, గౌరవ్ కుమార్ గా గుర్తించారు. వెబ్ సైట్ లో ఉంచిన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా.. అది తేజ్వీర్ సింగ్ పేరును, బ్యాంక్ ఖాతా నెంబర్ గౌరవ్ కుమార్ కు బదిలీ అవుతుందని పోలీసులు తెలిపారు. మోసపూరిత వసూళ్లకు పాల్పడుతున్నందున నిందితులపై ఐపీసీ 420, 419, 66 సి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇలాంటి మోసపూరిత వెబ్ సైట్లను నమ్మవద్దని పోలీసు ఉన్నతాధికారులు, రామ మందిర తీర్థ్ ప్రముఖులు ప్రజలకు సూచించారు. అయోధ్యతో పాటు బిలాస్ పూర్, కాన్పూర్, ముంబైలో కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.