• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO KILLED AFTER DRINKING CHEMICALS IN VIJAYAWADA PRN

Vijayawada: మందుకు డబ్బుల్లేక షేవింగ్ లోషన్ తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Vijayawada: మందుకు డబ్బుల్లేక షేవింగ్ లోషన్ తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడలో మద్యానికి డబ్బుల్లేక షేవింగ్ లోషన్ తాగి ఒకరు, మంచినీళ్లు అనుకొని అమ్మోనియం తాగి మరొకరు మృతి చెందారు.

  • Share this:
    విజయవాడలో ఒకేరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. మద్యానికి బానిసైన వ్యక్తి.. డబ్బుల్లేక షేవింగ్ లోషన్ తాగి ఒకరు.. మంచినీళ్లు అనుకొని అమ్మోనియా ద్రావకం తాగి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేశాయి. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సాయిరామ్ థియేటర్ సమీపంలోని పోతన భవనంలో యలమంచిలి లక్ష్మణ్‌, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. లక్ష్మణ్ సాయిరామ్ థియేటర్ సమీపంలోని ఓ సెలూన్లో పనిచేస్తున్నాడు. తాగుడు అలవాటున్న లక్ష్మణ్ రోజూ మద్యం తాగుతుంటాడు. ఈ క్రమంలో ఈనెల 5న షాపుకు వెళ్లాడు. ఆ రోజున తాగేందుకు డబ్బులు లేకపోవడంతో అక్కడే ఉన్న షేపింగ్ లోషనే తాగాడు.

    తాగిన వెంటనే బాగానే ఉన్న లక్ష్మణ్... సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యాడు. గుండెల్లో నొప్పు, వాంతులు, కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతి చెందారు. భార్య నాగమణి ఫిర్యాదుతో చిట్టినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై సెలూన్ యజమానిని విచారించారు.

    మంచినీళ్లు అనుకొని కెమికల్ తాగి
    భవానీపురం డాల్ఫిన్ బార్ సమీపంలో నివాసముంటున్న రెహ్మతుల్లా.. పున్నమీఘాట్ దగ్గర రంగులు తయారు చేస్తుంటాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుకాణంలో రంగుల తయారీకి ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ ను వాటర్ బాటిలో పోసి ఉంచాడు. పనిలో నిమగ్నమై ఉండగా దాహం వేయడంతో మంచినీళ్లు అనుకొని అమ్మోనియం ద్రావకం తాగేశాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో తోటి కార్మికులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తోటి కార్మికుల నుంచి వివరాలు తీసుకున్నారు.

    విజయవాడలోనే ఒకే ప్రాంతంలో రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్లుండి కుటుంబ పెద్దలను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ బోరున విలపిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: