ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చేయని తప్పునకు ఇద్దరు దళితులు దాడులకు గురయ్యారు. కోళ్లు దొంగిలించారనే ఆరోపణతో వారిద్దరినీ చెట్టుకు కట్టేసి.. ఆపై ఇష్టారీతినా గొడ్డును బాధిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా కొంత మంది వారి చుట్టూ గుమి గూడి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నెల 18 న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక పని మీద గొంతుపాడు గ్రామం లోకి వెళ్లగా.. అక్కడ బైక్ లో పెట్రోల్ నింపడానికి ఒక దుకాణం వద్ద ఆగారు. సదరు దుకాణుదారురాలితో.. తమకు బాటిల్ లో పెట్రోల్ కావాలని అడిగారు.
ఈ క్రమంలోనే పెట్రోల్ నింపుకోవడం పై ఆ ఇద్దరు చర్చించుకుంటుండగా.. ఆ దుకాణంలో ఉన్న మహిళ.. వీళ్ల వ్యవహారం తేడాగా ఉందని అనుకుంది. ఈ గ్రామంలో కోళ్లు ఎత్తుకుపోయేది వీళ్లేనని స్వీయ నిర్ధారణకు వచ్చి... చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. అక్కడ వారితో.. పెట్రోల్ పోసుకోవడానికి వచ్చిన వ్యక్తులే తమ గ్రామంలో కోళ్లను ఎత్తుకుపోతున్నారని నమ్మించేలా ఓ కట్టుకథ అల్లింది.
ఇది విన్న అక్కడ కొంతమంది వారిని అక్కడ పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి ఒక చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిని గొడ్డును బాధినట్టు బాధారు. దాంతో చాలదన్నట్టు.. వారి కట్లు విప్పి.. రక్తాలు వచ్చేలా కట్టెలు, బెల్టులతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారంతా అగ్ర కులాలకు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. దళితులను విచక్షణ రహితంగా కొట్టినందుకు గానూ.. నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:January 21, 2021, 21:28 IST