news18-telugu
Updated: July 17, 2020, 1:47 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. వారిద్దరూ అన్నదమ్ములు. మతిస్థిమితం సరిగాలేదు. వారి ముందు ఫోన్ మాట్లాడినా.. హారన్ సౌండ్ చేస్తూ వాహనం నడిపినా.. గొడ్డలి పట్టుకుని వెంబడిస్తారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతి. అయితే ఏమైందో ఏమోగానీ ఆరుగురు కుటుంబ సభ్యులను ఆ ఇద్దరు అన్నదమ్ములు అతిదారుణంగా హత్య చేశారు. ఇందులో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని బీజాదండి పోలీసు స్టేషన్ పరిధిలోని మనేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా పొడిచి చంపారు. మతిస్థిమితం సరిగా లేని హరీష్ సోని, అతని సోదరుడు సంతోష్ సోనిలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే గతంలోనూ నిందితుల ఇంటి ముందు నుంచి ఏదైనా వాహనం హారన్ సౌండ్ చేస్తూ వెళితే గొడ్డలిని తీసుకుని వెంబడిస్తారు.
వారి ముందు ఎవరైనా ఫోన్లో మాట్లాడితే.. వారిపైనా దాడి చేసేవారు. ఆరుగురిని హత్య చేసిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. హరీష్, సంతోష్లను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా, పోలీసులపైకి నిందితులు గొడ్డలి, కత్తి, కారంపొడితో దాడి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మరణించారని పేర్కొన్నారు. మరొక నిందితుడిని గ్రామస్తులు వెంటాడి చంపేశారు. చనిపోయిన ఆరుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Published by:
Narsimha Badhini
First published:
July 17, 2020, 1:43 PM IST