news18-telugu
Updated: October 6, 2020, 2:52 PM IST
ప్రతీకాత్మక చిత్రం
రెండేళ్ల చిన్నారిని సొంత అత్తలే హత్య చేశారు. బాలుడి తల్లి మీద జలసీతో వారు ఈ దారుణానికి ఓడిగట్టారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాలు.. సెప్టెంబర్ 29న బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు సూరజ్పూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ రాత్రి తర్వాత ఇంట్లోని వార్డ్రోబ్లో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఊపిరాడకపోవడం వల్లే బాలుడు మృతిచెందినట్టుగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బాలుడి ఇద్దరు అత్తలు పింకీ, రింకీల పాత్రపై ఆధారాలు లభించడంతో పోలీసులు వారిని విచారించారు. ఈ సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీకరించారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పింకీ, మరో నిందితురాలైన ఆమె అక్క రింకీతో కలిసి వారి తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పడు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. "సోదరుడి భార్య సప్న ప్రవర్తనతో నిందితులు కలత చెందారు. సప్న ప్రవర్తించే విధానం వాళ్లకు అసలు నచ్చకపోయేది. వాళ్ల సోదరుడు కూడా ఎప్పుడు భార్య వైపే నిలిచేవాడు. పలు విషయాల్లో వాళ్లను తిట్టేవాడు. ఇది వారిలో మరింత ద్వేషాన్ని నింపింది. ఈ క్రమంలోనే వారిద్దరు కలిసి బాలుడిని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని దుప్పట్లో పెట్టి ఇంట్లోని వార్డ్రోబ్లో దాచిపెట్టారు" అని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి ఐపీసీ సెక్షన్స్ 302, 201ల కింద పింకీ, రింకీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 6, 2020, 2:44 PM IST