ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. చావే పరిష్కారమా..?

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాక.. విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

news18-telugu
Updated: June 20, 2020, 10:59 AM IST
ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. చావే పరిష్కారమా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యా కుసుమాలు నేల రాలుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొందరు పాస్ అయినప్పటికీ.. తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాక.. విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్,సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన సోని (16)కి ఇంటర్ ఫలితాల్లో 314 మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపంతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం సరయు (16) మూడు సబ్టెక్టుల్లో ఫెయిల్ అయింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె శుక్రవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్‌ తండాకు చెందిన నిఖిత (18) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయింది. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన శ్రావణి (17) కూడా ఉరేసుకొని మరణించింది. గజ్వేల్‌ పట్టణానికి చెందిన బద్రీనాథ్‌ (17) సైతం ఇంటర్‌ పరీక్షల్లో తప్పడంతో శుక్రవారం రాత్రి ఉరేసుకొని చనిపోయాడు.

విద్యార్థుల ఆత్మహత్యలతో విద్యావేత్తల, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌లో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే బతుకగలమన్నట్లుగా కాలేజీలు విద్యార్థులకు చెబుతున్నాయని.. ఈ క్రమంలోనే చాలా మంది చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్ ఐనా.. భవిష్యత్ ఉంటుందని, ఇతర రంగాల్లోనూ రాణించవచ్చని విద్యార్థులకు భరోసా ఇవ్వాలని సూచిస్తున్నారు. అటు తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఫెయిల్ అయినందుకు.. తిట్టడం, కొట్టడం లాంటివి చేయవద్దని.. వారికి అండగా నిలవాలని కోరుతున్నారు.
First published: June 20, 2020, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading