TRIPURA MAN ARRESTED FOR KILLING 5 INCLUDING MINOR DAUGHTERS AND POLICE OFFICER WITH SHOVEL CM BIPLAB DEB CONDOLED MKS
shocking : డిప్రెషన్లో ఇంత దారుణమా? -మైనర్ కూతురుళ్లు, అడ్డొచ్చిన పోలీసు సహా 5గురిని కిరాతకంగా..
ఉన్మాది దాడిలో చనిపోయిన పోలీస్ సత్యజిత్, అమరుడికి సీఎం బిప్లబ్ దేవ్ నివాళి
పార చేతపట్టుకున్న ఉన్మాది ఇంట్లోవాళ్లతోసహా వీధిలో కనిపించిన అందరిపైనా కిరాతకంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన పోలీసును కూడా దారుణంగా హతమార్చాడు. అతని ఉన్మాదానికి ఏకంగా ఐదుగురు బలయ్యారు. త్రిపురలో చోటుచేసుకున్న ఈ దారుణంపై సీఎం బిప్లబ్ దేబ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
నెత్తురు ఏరులై పారితే ఎలా ఉంటుంటో ఆ గ్రామస్తులు మొదటిసారి కళ్లారా చూశారు.. తాపీ మేస్త్రీగా పనిచేసే ఓ వ్యక్తి పారనే మారణాయుధంగా చేసుకుని అతి కిరాతకంగా ఐదుగురిని చంపేశాడు (Tripura man killed five). కొన్నాళ్లుగా కుంగుబాటు(డిప్రెషన్)తో బాధపడుతున్నట్లుగా చెబుతోన్న ఆ వ్యక్తి.. పట్టరాని ఉన్మాదంతో ముందుగా ఇంట్లో వాళ్లపై దాడి చేశాడు.. ఇంటినిండా ఎటు చూసినా రక్తమే.. దాడిలో ఇద్దరు కూతుళ్లు (daughters) అక్కడికక్కడే చనిపోగా, భార్యకు తల పగిలింది.. అంతటితో ఆగకుండా పార చేతబట్టుకుని వీధిలో తిరుగుతూ అడ్డొచ్చినవాళ్లందరినీ చంపడానికి ప్రయత్నించాడు. చివరికి అతణ్ని అదుపులోకి తీసుకోడానికి వచ్చిన పోలీసు (Police)ను సైతం కిరాతకంగా చంపేశాడు. త్రిపురలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఖొవాయ్ జిల్లా పోలీసులు చెప్పిన వివరాలివి..
త్రిపుర రాజధాని అగర్తలాకు 50 కిలోమీటర్ల దూరంలో షెవ్రాతలి అనే గ్రామం ఉంది. ఖొవాయ్ జిల్లా పరిదిలోని ఆ ఊరిలో శుక్రవారం రాత్రి ఘోరకలి చోటుచేసుకుంది. పార చేతపట్టుకున్న ఉన్మాది ఇంట్లోవాళ్లతోసహా వీధిలో కనిపించిన అందరిపైనా కిరాతకంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన పోలీసును కూడా దారుణంగా హతమార్చాడు. అతని ఉన్మాదానికి ఏకంగా ఐదుగురు బలయ్యారు. షెవ్రాతలికి చెందిన ప్రదీప్ దెబ్రాయ్(40) భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతోన్న ప్రదీప్.. చీటికీ మాటికి కోపంతో ఊగిపోయేవాడు. అతని పరిస్థితి తెలిసి ఇంట్లోవాళ్లంతా భయంతో కుక్కిన పేనుల్లా పడుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రదీప్ ఒక్కసారే ఉన్మాదిగా మారిపోయాడు..
ఇంట్లో మూలన ఉన్న పారను తీసుకుని కుటుంబీకులపై కిరాతకంగా దాడి చేశాడు. పారతో బలంగా తలపై మోదడంతో అతని మైనర్ కూతురుళ్లు అదితి, మందిర స్పాట్ లోనే చనిపోయారు. తల పగిలిపోయిన భార్య మాల.. రక్తం కారుతుండగా బయటికి పరుగు తీసింది. అరుపులు, కేకలకు ఉలిక్కిపడ్డ పక్కింట్లో ఉండే సోదరులు పరుగున వచ్చి ప్రదీప్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్లపైనా దాడి చేశాడు. పెద్దన్న అమలేశ్ ను కూడా చంపేశాడు ప్రదీప్. ఆ తర్వాత మారణాయుధంతో వీధిలోకి వెళ్లి కనిపించినవాళ్లందరిపైనా దాడికి తెగబడ్డాడు..
రోడ్డు మీద వెళుతోన్న ఓ ఆటోను ఆపి ఆటోడ్రైవర్, అతని కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ చనిపోగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్మాది వీరంగం గురించి సమాచారం అందడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యజిత్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లాడు. పోలీసులు చూడగానే మరింత రెచ్చిపోయిన ప్రదీప్.. ఎస్ఐని సైతం పారతో కొట్టి చంపాడు. ఈలోపే పోలీసుల బృందం అక్కడికి చేరుకుని అతి కష్టంమీద ప్రదీప్ ను పట్టుకోగలిగారు. మొత్తం ఏడుగురిపై ప్రదీప్ దాడి చేయగా, అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
ఉన్మాది దాడిలో పోలీస్ అధికారి చనిపోవడం త్రిపురలో కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ స్పందించారు. ఉన్మాద చర్యకు బలైన పోలీస్ అధికారి సత్యజిత్ మాలిక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సీఎం స్వయంగా ఎస్ఐ అంత్యక్రియలకు హాజరయ్యారు. నిందితుడు ప్రదీప్ పై కఠిన చట్టాల కింద కేసు పెట్టామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఖొవాయ్ జిల్లా పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.