జలంధర్: పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఘోరం జరిగింది. నగరంలోని డీఏవీ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తేజీందర్ కౌర్ అనే 27 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎంతో బాధాకరమైన స్థితిలో ఆ యువతి చనిపోవడం చూపరులను కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తేజీందర్ కౌర్ అనే యువతి తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. ఆమెకు భూపేందర్ సింగ్‌తో సంవత్సరంనర క్రితం వివాహమైంది. భూపేందర్ సింగ్ కెనడాలో స్థిరపడ్డాడు. తేజీందర్ కౌర్ కూడా పెళ్లి కాక ముందు కొంతకాలం ఇంగ్లండ్‌లో ఉంది. ఆమెకు బ్యూటీషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. పెళ్లి తర్వాత భర్త కూడా సహకరించడంతో ఆమె జలంధర్‌కు వచ్చి ఇక్కడే బ్యూటీషియన్ కోర్స్ చేస్తోంది.
రోజూలానే గురువారం కూడా స్కూటీపై ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి బయల్దేరింది. అలా వెళుతున్న ఆమె స్కూటీని డీఏవీ కాలేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. హెల్మెట్ కూడా ధరించకపోవడంతో తలకు బలంగా గాయమై స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న తేజీందర్ కౌర్ మరికొద్ది రోజుల్లో కోర్సు పూర్తి చేసుకుని కెనడాలో భర్త వద్దకు వెళ్లాల్సి ఉంది. అలాంటి సమయంలో మృత్యువు ఆమెను రోడ్డు ప్రమాదం రూపంలో కబళించేసింది. ఇదిలా ఉండగా.. ఆమెకు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. అయితే.. 108 సకాలంలో రాలేదు. దీంతో.. ఆమె రోడ్డు మీదే ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి: Shocking: ఎందుకు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకిలా చేస్తారో.. చేసిందంతా చేసి ఎంతబాగా...
తేజీందర్ చనిపోయిన విషయం తెలిసి ఆమె తల్లి కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన చోటకు చేరుకుని కూతురిని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కూతురిని ఆ స్థితిలో చూసిన తల్లి తట్టుకోలేకపోయింది. ఆ షాక్‌లో తేజీందర్ కౌర్ తల్లి స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కూతురికి బంగారం లాంటి భవిష్యత్ ఉందని, విదేశాల్లో అల్లుడితో కలిసి స్థిరపడబోతోందని ఆశించిన తల్లికి నిరాశ ఎదురైంది. ప్రమాదం జరిగిన సందర్భంలో లారీ నడిపిన డ్రైవర్ స్పాట్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే.. రోడ్డుపై ఉన్న జనం అతనిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Bike accident, Crime news, Married women, Road accident, SCOOTER