Wife Chunni: ఏ భర్తకూ ఇలాంటి చావు రాకూడదు.. భార్య మెడలో చున్నీనే భర్తకు యమపాశమైంది..!

భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న రాయమ్మ

కర్ణాటకలోని మండ్య పరిధిలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. భార్య చున్నీనే ఆ భర్తకు యమపాశమైంది. గర్భిణి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఆమె చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కుని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని హలగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకనహళ్లి దగ్గర శనివారం జరిగింది.

 • Share this:
  మండ్య: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. టైం బ్యాడ్ అయితే తాడే పామై కరుస్తుందంటారు. అందుకే.. రోడ్డు ప్రయాణాలు చేసే సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కేవలం తోటి వాహనాలను గమనించడమే కాదు బైక్‌పై వెళుతున్నప్పుడు వెనుక కూర్చున్న వాళ్లు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా.. బైక్‌పై మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బైక్‌పై వెళ్లే సమయంలో కొందరు మహిళలు చీర కొంగును, చున్నీని ముందుకు వేసుకోకుండా వెనుకకు వదిలేస్తుంటారు. పొరపాటున ఆ చీర కొంగు గానీ.. చున్నీ గానీ బైక్ చక్రంలో ఇరుక్కుంటే అనర్థం జరగక మానదు. కర్ణాటకలోని మండ్య పరిధిలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. భార్య చున్నీనే ఆ భర్తకు యమపాశమైంది. గర్భిణి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఆమె చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కుని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని హలగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకనహళ్లి దగ్గర శనివారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యాదగిరి జిల్లా సరుపుర తాలూకా చిక్కనహళ్లికి చెందిన మౌనేశ్వప్ప(32) తన భార్య రాయమ్మతో కలిసి మండ్య జిల్లా సావందిపుర గ్రామంలో నివాసముంటున్నాడు. మౌనేశ్వప్ప జేసీబీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. తనకొస్తున్న సంపాదనతో భార్యను సుఖంగానే చూసుకుంటున్నాడు. రాయమ్మ గర్భం దాల్చింది. ఈ క్రమంలో.. వైద్య పరీక్షల నిమిత్తం భార్యను హలగూరు ఆస్పత్రికి తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. శనివారం కూడా మౌనేశ్వప్ప తన భార్య వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను బైక్‌పై ఎక్కించుకుని హలగూరు వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం.. భార్యను బైక్‌పై ఎక్కించుకుని తిరుగు పయనమయ్యాడు. అయితే.. బైక్‌పై రాయమ్మ కూర్చున్న సమయంలో ఆమె చున్నీ వెనుకకు పడిపోయింది.

  ఈ విషయాన్ని భార్యాభర్తలిద్దరూ గమనించలేదు. కొద్ది దూరం బైక్‌పై వెళ్లాక.. ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె చున్నీ బైక్ వెనుక చక్రానికి చుట్టుకుంది. దీంతో.. బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో రాయమ్మ బైక్‌పై నుంచి కిందకు పడి స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ.. ఆమె భర్త మౌనేశ్వప్పకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తల చెట్టుకు తగిలి బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనలో మౌనేశ్వప్ప ఘటనా స్థలంలోనే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తన నిర్లక్ష్యమే భర్త ప్రాణం తీసిందంటూ రాయమ్మ భర్తను ఒడిలోకి తీసుకుని గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

  బైక్‌పై మహిళలు ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. లేకపోతే వారి ప్రాణాలతో పాటు బైక్‌ నడిపే వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఈ ఘటనపై హలగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గర్భిణి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి తిరిగి వెళుతుంటే మౌనేశ్వప్ప ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో సావందిపుర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
  Published by:Sambasiva Reddy
  First published: