దేశంలో ఎక్కడైనా సాధారణంగా ఓ అంబులెన్స్ (Ambulance) వెళ్తుంటేనే ఇతర వాహనాలు పక్కకు జరిగి మరీ దానికి దారి ఇవ్వాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోతే ఆ మార్గంలోని ఇతర వాహనదారులు పక్కకు జరిగి మరీ దారిస్తారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఓ నిండు ప్రాణం కాపాడటం కోసం ఎవరైనా కాస్త కనికరం చూపిస్తారు. అయితే ఇందుకు భిన్నమైన ఘటన యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి దగ్గర మంగళవారం జరిగింది. ఫలితంగా ఓ శిశువుకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా (Janagama District) జనగామ మండలం మరిపగి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశ, సరస్వతి దంపతులు. వీరికి మూడు నెలల కిందట కుమారుడు (baby boy) పుట్టాడు. అతనికి రేవంత్ అని పేరు పెట్టుకున్నారు. అయితే, అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా శిశువు పాలు తాగడం లేదు. దీంతో కొద్ది రోజుల నుంచి జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అక్కడ మెరుగైన ఫలితాలు కనిపించకపోవడంతో మంగళవారం పరీక్షలు చేసిన డాక్టర్లు రేవంత్ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోందని తేల్చారు.
కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా..
వెంటనే హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో అందుబాటులో ఉన్న కారును అద్దెకు తీసుకున్న తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కారు ప్రవేశించింది. అయితే యాదాద్రికి సమీపంలోని వంగపల్లి వద్ద ట్రాఫిక్ (Traffic) కానిస్టేబుళ్లు ఈ కారును నిలిపారు. కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా కారును ఆపారు. ఈ కారుపై పెండింగ్ చలాన్లు చెక్ చేస్తే రూ. 1000 కూడా ఉంది. అయితే ఈ పెండింగ్ చలాను చెల్లిస్తేనే (to pay the challan) కారును వదిలేస్తామని కారును నిలిపివేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ చెక్‌పోస్టు దగ్గర అప్పటికే అరగంట దాటిపోయింది. అనంతరం హైదరాబాద్ చేరుకున్నాక ఆసుపత్రిలో చూపించారు. అయితే ఆసుపత్రికి ఆలస్యంగా చిన్నారిని తీసుకురావడంతో చిన్నారి మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.
10 నిమిషాలు ముందు వచ్చినా బతికేదన్నారు..
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద కారును ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) నిలిపివేశారు. కారుపై ఉన్న చలాన్ చెల్లిస్తేనే వదిలివేస్తామని చెప్పారని చిన్నారి తల్లి తెలిపింది. డ్రైవర్ వద్ద ఉన్న లైసెన్స్ ను కూడా పోలీసుల తీసుకెళ్లారని కూడా ఆమె ఆరోపించింది. అయితే నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స ప్రారంభించే సమయంలో చిన్నారిని మరణించినట్టుగా (Died) ఆమె వివరించారు. కనీసం 10 నిమిషాల ముందు ఆసుపత్రికి తీసుకొచ్చినా తమ చిన్నారి బతికేదని వైద్యులు చెప్పారన్నారు. అయితే కారులో మూడు మాసాల చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయం తమకు తెలియదని పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలిస్తే తాము వారికి సహకరించే వాళ్లమని ట్రాఫిక్ ఎస్ఐ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Traffic police, Yadadri