TO BURGLE HIS FORMER BOSS HOME A MAN WENT ON DIET TO LOSE WEIGHT TO SLIGHTER THROUGH A WINDOW JNK GH
Viral: మాజీ యాజమాని ఇంట్లో దొంగతనం.. కిటికీలో దూరేందుకు పది కిలోలు బరువు తగ్గి మరీ రూ.37 లక్షలు చోరీ..
కిటికీ సందులో పట్టడానికి వెయిట్ తగ్గి మరీ దొంగతనానికి వచ్చాడు..
ఎవరైనా ఆరోగ్యం కోసం బరువు తగ్గుతారు. కానీ అతడు మాత్రం యజమాని సొత్తు అపహరించడానికి ఏకంగా పది కిలోల బరువు తగ్గాడు. అంతేకాదు, సన్నగా తయారై యజమాని ఇంటి కిటికీ నుంచి దూరి రూ.37 లక్షలు చోరీ చేశాడు.
ఒక పనిమనిషి చోరుడుగా(Thief) అవతారమెత్తి రూ.37 లక్షలు దొంగలించాడు. తన మాజీ యజమాని (Employer) ఇంట్లో కన్నం వేసేందుకు ఇతడు రూపొందించిన ప్లాన్ అందరి మతిపోగొడుతోంది. ఎవరైనా ఆరోగ్యం (Health) కోసం బరువు తగ్గుతారు (Weight Loss). కానీ అతడు మాత్రం యజమాని సొత్తు అపహరించడానికి ఏకంగా పది కిలోల బరువు తగ్గాడు. అంతేకాదు, సన్నగా తయారై యజమాని ఇంటి కిటికీ నుంచి దూరి రూ.37 లక్షలు చోరీ చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
వివరాలు ఇలా ఉన్నాయి... మోతీసింగ్ చౌహాన్(34) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం బోపాల్‌లోని బసంత్ బహార్ సొసైటీలో మోహిత్ మరాడియా ఇంట్లో పనిచేశాడు. పని చేస్తున్న సమయంలోనే ఓనర్ మోహిత్ నివాసంలో బంగారు ఆభరణాలు, నగదు తదితర విలువైన వస్తువులు ఎక్కడ భద్రపరుస్తారనేది మోతీసింగ్ తెలుసుకున్నాడు. అప్పుడే ఆ సొమ్ము కాజేయాలనే దుర్బుద్ధి మోతీసింగ్ లో పుట్టింది. అప్పట్నుంచి దొంగతనం చేసే దిశగా ఆ నివాసంలో ఎక్కడ సీసీటీవీ కెమెరాలు అమర్చారో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తరువాత ఇంటి ముందు, వెనుక ఉన్న తలుపులు హై-టెక్నాలజీ డిజిటల్ డోర్స్ అని అర్థం చేసుకున్నాడు. అవి పగలగొట్టడం అసాధ్యమని భావించాడు. కానీ అదను చూసి ఎలాగైనా దొంగతనం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు.
ప్రస్తుతం సింధు భవన్ రోడ్‌లోని మరొక వ్యక్తి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న మోతీసింగ్ చౌహాన్ ఓ పక్కా ప్రణాళిక రూపొందించాడు. మూడో కంటికి తెలియకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా వంటగది కిటికీలోంచి ఇంటిలోకి ఈజీగా జొరబడొచ్చని అనుకున్నాడు. కానీ లావుగా ఉండే తను ఆ సన్నటి కిటికీ ద్వారా ఇంటిలోకి ప్రవేశించడం అసాధ్యమనుకున్నాడు. అందుకే ఏకంగా పది కిలోల బరువు తగ్గాడు. అయితే 75 కేజీల నుంచి 65 కిలోలకు బరువు తగ్గడానికి మోతీసింగ్ రాత్రిపూట భోజనం మానేశాడని ప్రస్తుత యజమాని తెలిపాడు.
బరువు తగ్గిన తరువాత మోతీసింగ్ వంట గది కిటికీ పగలగొట్టేందుకు ఒక రంపం, తాపీని సిద్ధం చేసుకున్నాడు. అనంతరం నవంబర్ 5న మోహిత్ మరాడియా ఇంట్లోకి జొరబడ్డాడు. ఎక్కడెక్కడ సొమ్ము ఉంటుందో ముందస్తుగానే తెలుసు కాబట్టి క్షణాల్లోనే రూ.37 విలువైన నగదు, ఆభరణాలను సర్దేసి బయటపడ్డాడు. అతడు వచ్చినట్లు.. చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అహ్మదాబాద్ గ్రామీణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేశారు. కానీ దొంగ జాడ కనిపించకపోవడంతో.. తమ తెలివిని ఉపయోగించారు. బోపాల్‌లోని హార్డ్‌వేర్ దుకాణంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి.. మోతీసింగ్ ఘటన జరిగిన వైపే సంచరించినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత మోతీసింగ్ సెల్‌ఫోన్ లొకేషన్ ట్రాక్ చేశారు. అలా మోతీసింగ్ ఉదయపూర్‌లోని తన స్వస్థలానికి వెళ్లడానికి బస్సు ఎక్కబోతుండగా పోలీసులు అతన్ని ఎస్పీ రింగ్ రోడ్ వద్ద పట్టుకున్నారు.
అప్పుడు అతని దగ్గర దోపిడి సొమ్ము దొరికింది. దాంతో అతడి నుంచి అన్ని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అయితే దొంగతనం చేయడానికి అతడు ఏకంగా 10 కిలోలు తగ్గాడని తెలిసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఈ డెడికేషన్ ఇతర పని పట్ల పెట్టినట్లయితే బాగుండు కదా దొంగగారూ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.