TIRUPATI MADANAPALLI DOUBLE MURDER CASE ACCUSED PARENTS DISCHARGED FROM VISAKAPATNAM MENTAL HOSPITAL CASE INVESTIGATION MAY END SOON FULL DETAILS HERE PRN
Madanapalli Double Murder Case: మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం... ఇప్పటికైనా మిస్టరీ వీడుతుందా..?
మదనపల్లె జంట హత్యల కేసులో కీలకపరిణామం
మదనపల్లి జంట హత్యల (Madanapalli Double Murder case) కేసు దర్యాప్తు కీలకదశకు చేరింది. త్వరలోనే కేసు దర్యాప్తును ముగిస్తామని పోలీసులు చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో (Madanapalli Double Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. మూఢమ్మకాలతో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ అంతుచిక్కని మానసిక వ్యాధితో బాధపడుతూ డాక్టర్లు, పోలీసులకు చుక్కలు చూపించారు. ఈనేపథ్యంలో వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రి నుంచి.. విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. రెండు నెలల పాటు అక్కడ చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చిన డాక్టర్లు వారిద్దరినీ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అనంతరం మదనపల్లి పోలీసులకు అప్పగించారు. దీంతో వారిని ప్రత్యేక వాహనంలో మదనపల్లి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి మానసిక స్థితి సరిగానే ఉందని డాక్టర్లు తేల్చారు. డిశ్చార్జ్ అయిన సమయంలో ఇద్దరు సాధారణంగానే ప్రవర్తించినట్లు సమాచారం. ఇద్దరికి ట్రీట్ మెంట్ పూర్తవడంతో కేసు దర్యాప్తు మరింత సులభమయ్యే అవకాశముంది. త్వరలోనే జంట హత్యలకు సంబంధించిన కీలక అంశాలు రాబట్టి దర్యాప్తును పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న పురుషోత్తం నాయుడు, మదనపల్లిలో మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న పద్మజ.. జనవరి 24న కన్నకూతుళ్లైన అలేఖ్య, సాయిదివ్యలను డంబెల్లో కొట్టి దారుణంగా హత్య చేశారు. మూఢనమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మిన తల్లిదండ్రులు తమ కుమార్తెలు మళ్లీ బ్రతికి వస్తారని నమ్మి పూజలు చేసిన అనంతరం వారిని కొట్టి చంపారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పూర్తిగా ఆధ్యాత్మిక మాయలో ఉండిపోయిన కుటుంబం దారుణానికి ఒడిగట్టింది.
ఐతే కేసులో పురుషోత్తంనాయుడు, పద్మజను అరెస్ట్ చేసిన పోలీసులకు ఆ దంపతులిద్దరూ చుక్కలు చూపించారు. తాము కారణజన్ములమని చెప్పడం, శివుడి ప్రతిరూపాలమని గట్టిగా అరవడమే కాకుండా.. పోలీసుల వల్లే తమ కుమార్తెలు బ్రతకలేదని నిందలు వారిపైనే వేడయం వంటి చేష్టలకు పాల్పడ్డారు. విచారణలో ఒఖ్క క్లూ కూడా లభించకపోవడంతో చేసేది లేక పోలీసులు విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించారు.
ఈ దారుణాలు జరగడానికి ప్రధాన కారణం అలేఖ్యగా పోలీసులు అప్పట్లో అనుమానించారు. విచారణలో వెల్లడైన అంశాలను బట్టి.. తాను చనిపోయిన పెంపుడు కుక్కను బ్రతికించానని.., దెయ్యం పట్టిన సాయి దివ్యను కూడా చంపేస్తే తిరిగి బ్రతికిస్తానని చెప్పింది. దీంతోనే పద్మజ సాయి దివ్యను డంబెల్ కొట్టి హతమార్చినట్లు తెలుస్తోంది. సాయి దివ్యను చంపిన అనంతరం.., రాగిచెంబును నోట్లో పెట్టుకొన్న అలేఖ్య.. తనను కూడా డంబెల్ తో కొట్టి చంపాలని తల్లిని కోరగా..అప్పటికే మూఢవిశ్వాసంతో ఉన్న పద్మజ.. అలేఖ్యను కొట్టిచంపినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. తాజాగా ఇద్దరూ డిశ్చార్జ్ అవడంతో కేసు దర్యాప్తు కొలిక్కివచ్చే అవకాశముంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.