Home /News /crime /

TIGER ATTACK ON BUFFALOES IN ASIFABAD DISTRICT NS ADB

Tiger Attack: ఆసిఫాబాద్ జిల్లాలో మరో సారి పెద్ద పులి కలకలం.. బర్రెలపై దాడి

పెద్దపులి దాడిలో గాయపడిన బర్రె

పెద్దపులి దాడిలో గాయపడిన బర్రె

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి హడలెత్తించింది. కాగజ్ నగర్ మండలం కడంబ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన నాలుగు బర్రెల పై పెద్ద పులి దాడి చేసింది.

  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి హడలెత్తించింది. కాగజ్ నగర్ మండలం కడంబ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన నాలుగు బర్రెల పై పెద్ద పులి దాడి చేసింది. ఒక్కసారిగా పులి దాడికి దిగడంతో బెదిరిపోయిన ఆ బర్రెలు పారిపోయి అడవి మార్గం ద్వారా ఆడెపల్లికి గ్రామానికి చేరుకున్నాయి. ఈ బర్రెలు కడంబ గ్రామానికి చెందిన కోట మల్లయ్య బర్రెలుగా గ్రామస్థులు గుర్తించారు. కాగజ్ నగర్ మండలం మాణిక్ పటార్ అటవీ ప్రాంతంలో పెద్దపులి గ్రామస్థులకు తారసపడింది. పులి పాద ముద్రలు కూడా లభ్యమయ్యాయి. ఇదిలా ఉంటె నిన్న పెంచికల్ పేట మండలం మేరేగుడా గ్రామ సమీపంలో పత్తి చేనులో పత్తి ఏరుతున్న జాడి ఏమజి, హేమలత లకు పులి కనించడంతో వారు భయంతో అరుస్తు అక్కడి నుంచి పారిపోయారు. వారి అరుపులు విన్న పులి అడవిలోకి పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి తమకు పెద్ద పులి నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

  ఇటీవల ఓ యువతిపై పెద్ద పులి పంజా విసిరి బలితీసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పత్తి చేనులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల అనే యువతిపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా కూలీలు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పులి వెనక నుంచి దాడి చేయడంతో ఎవరూ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. ఈ సంఘటనతో కొండపల్లి గ్రామస్థులు భయాందోళనతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి జాడల ఆధారంగా దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

  కాగా.. ఈ నెల 11న దహెగాం మండలం దిగుడ గ్రామంలో ఓ పులి గిరిజన యువకుడిపై దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికే దిగుడ గ్రామంలో యువకుడిపై దాడి చేసిన పులి కోసం అటవీ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దాని జాడ లభించకపోగా పలుచోట్ల పులి ఆవుల మందపై దాడి చేయడం, బాటసారులను హడలెత్తించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇదిలా ఉంటే గతంలో యువకుడిపై దాడి చేసిన పులి, యువతిని హతమార్చిన పులి ఒక్కటేనా అని నిర్ధారణ కావాల్సి ఉంది. అసలు జిల్లాలో ఎన్ని పులులు తిరుగుతున్నాయి, అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయన్నది కూడా తెలియాల్సి ఉంది. జిల్లాలో వరుస ఘటనలతో అటవీ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Asifabad, Tiger Attack

  తదుపరి వార్తలు