news18-telugu
Updated: May 20, 2020, 12:46 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ఉసురు తీసింది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని కొంతమంది దుండగులు దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నరసింహులు గౌడ్‌ను బుధవారం ఉదయం కొంతమంది దుండగులు దారుణంగా కొట్టారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నరసింహులు గౌడ్‌ను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏడాదిన్నర క్రీతం నరసింహులు గౌడ్‌పై ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ అమ్మాయి తరపు బంధువులు కేసు పెట్టారు. ఇదిలావుంటే.. బుధవారం ఉదయం నరసింహులుగౌడ్ తమ గేదెలను తోలుకుని వెళ్తుండగా గ్రామ శివారులో కొంతమంది మాటు వేసి దారుణంగా కొట్టి చంపారు. ఈ విషయంపై యువకుడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ కొడుకు ఎవ్వరినీ వేధించలేదని, ఆ అమ్మాయే తమ కొడుకుని ప్రేమించిందని తెలిపారు.
అందుకే కక్ష పెంచుకుని అకారణంగా కేసు పెట్టి గతంలో వేధించారని తెలిపారు. మంగళవారం తమ అమ్మాయిని చేసుకోవాలని ఓ వ్యక్తితో రాయబారం పంపగా, నరసింహులుగౌడ్ నిరాకరించినట్టు చెప్పారు. అందుకే అమ్మాయి తరపు బంధువులు కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Narsimha Badhini
First published:
May 20, 2020, 12:24 PM IST