పుట్టింట్లో ఉంటున్న భార్య కోసం వచ్చిన భర్త.. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి చూస్తే కనిపించిందో ఘోరం..!

ప్రతీకాత్మక చిత్రం

అదనపు కట్నం వేధింపులతో భార్య పుట్టింటికి చేరింది. కొద్ది రోజుల తర్వాత ఆమె కోసం అత్తారింటికి వెళ్లాడా అల్లుడు. తలుపులు వేసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ స్పందించలేదు. దీంతో కిటికీలోంచి చూస్తే..

 • Share this:
  కూతురితో సహా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లి, అమ్మమ్మతో కలిసి సిటీలో భార్య ఓ అద్దెంట్లో ఉంటున్నట్లు ఆ భర్తకు తెలిసింది. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. ’నాకు డబ్బులు కావాలి. రేపు వస్తా. ఇవ్వకపోతే మాత్రం మీ అంతు చూస్తా. నేను వేధిస్తున్నానని పుట్టింటికి వెళ్తావా? రేపు నాకు డబ్బు ఇవ్వకపోతే మీ అంతు చూస్తా‘ అంటూ బెదిరించాడు. అప్పటికే అతడి వేధింపులతో విసిగి వేసారిపోయి ఉన్న ఆ భార్య తీవ్ర భయాందోళనలకు గురయింది. తన భర్తకు డబ్బు ఇచ్చేందుకు పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవనీ, కూలి పనులు చేసి బతుకుతున్నామని వాపోయింది. చివరకు తన తల్లి, అమ్మమ్మతో కలిసి ఆ భార్య దారుణ నిర్ణయం తీసుకుంది. తన భర్త ఇంటికి వచ్చే లోపే మూడు తరాల మహిళలు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడులోని విరుదునగర్ జిల్లా కార్యాపట్టి కీలవనూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల ఆడైకలం అనే మహిళకు 42 ఏళ్ల ముస్టికురిచ్చి అనే కుమార్తె ఉంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. కుమార్తె జయలలితకు 18 ఏళ్ల వయసు. ఇటీవలే కుమార్తెకు ఇంజనీర్ గా పనిచేస్తున్న తన సమీప బంధువు ముత్తుకుమార్ కు ఇచ్చి పెళ్లి చేసింది. మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చిపెళ్లి చేస్తే కూతురు హ్యాపీగా ఉంటుందన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే భార్యను ముత్తుకుమార్ వేధించేవాడు. అదనపు కట్నం తేవాలని హింసించేవాడు. అంతే కాకుండా తన బావమరుదులకు ఫోన్ చేసి తన భార్యపై, అత్తపై లేని పోని అబద్దాలు చెప్పేవాడు.

  ’మీ అమ్మకు, మీ చెల్లికి వేరే వాళ్లతో వివాహేతర సంబంధం ఉంది. నాకు ఈ మధ్యనే తెలిసింది‘ అంటూ బావమరుదులకు చెప్పేవాడు. దీంతో వారి మధ్య విబేధాలు రాసాగాయి. అతడి చిత్రహింసలను భరించలేక జయలలిత తన తల్లి ముస్టికురిచ్చి వద్దకు వచ్చింది. ఆ తల్లీకూతుళ్లిద్దరూ కలిసి అమ్మమ్మ ఆడైకలంతో సహా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తన భార్యకు ఫోన్ చేశాడు. మంగళవారం తాను వస్తాననీ, పెద్ద మొత్తంలో డబ్బును సిద్ధంగా ఉంచాలని బెదిరించాడు. ఈ విషయమై ముగ్గురు మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అంత డబ్బును ఎలా తేగలమని వాపోయారు.

  మంగళవారం ఉదయం ముత్తుకుమార్ తన భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టినా, ఎన్నిసార్లు పిలిచినా తలుపులు తీయలేదు. ఎవరూ స్పందించలేదు. దీంతో పక్కిళ్ల వాళ్ల సాయంతో కిటికీలోంచి చూస్తే ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపించాయి. ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గ్రహించి ముత్తుకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలిసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్లుడి వేధింపుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న ముత్తుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: