ముగ్గురు కుర్రాళ్లు. ముగ్గురిదీ ఒకే వయసు. అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్. ఇంటర్లో కూడా ముగ్గురూ మాట్లాడుకునే ఒకే కాలేజీలో చేరారు. ప్రాణస్నేహితులైన వీళ్లను చూసి విధికి కన్ను కుట్టిందేమో. రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురినీ ఒకేసారి తీసుకెళ్లింది. మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డుపల్లి మహేశ్, మాధవరపు శివ చౌదరి, నడ్డి శ్రీకాంత్ అనే ముగ్గురు కుర్రాళ్లకు 17 ఏళ్ల వయసు. ముగ్గురిదీ ఒకే కాలేజీ. అయిదో తరగతి నుంచే వీళ్లు ప్రాణ స్నేహితులు. నల్లగొండలోని గౌతమి కాలేజీలో ముగ్గురూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిలో బొడ్డుపల్లి మహేశ్ ది హాలియా మున్సిపాల్టీలోని అనుముల కాగా, మాధవరపు శివచౌదరిది పెద్దవూర మండలం చింతపల్లి గ్రామం, నడ్డి శ్రీకాంత్ ది గుర్రంపోడు మండలం నడ్డివారి గూడెం.
వీళ్ల ముగ్గురి స్నేహం గురించి వారి వారి ఇళ్లల్లో అందరికీ తెలుసు. త్వరలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సంబంధించిన పరీక్షలు ఉండటంతో ముగ్గురూ కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ ను తెచ్చుకోవాలనుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాంత్ కు చెందిన బైక్ పై ముగ్గురూ నల్లగొండకు బయలుదేరారు. జోకులు వేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ రయ్యిమంటూ వెళ్తున్నారు. మార్గమధ్యంలో చింతగూడెం సమీపంలో నల్లగొండ నుంచి వీళ్లకు ఎదురుగా ఓ టిప్పర్ అతి వేగంగా దూసుకొస్తోంది. అతి వేగంలో అదుపు తప్పి ముగ్గురు స్నేహితులు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది.
టిప్పర్ ఢీకొట్టడంతో ముగ్గురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెద్ద చదువులు చదివి తమకు అండగా ఉంటారని భావిస్తే ఇంత ఘోరం జరిగిందేంటని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బొడ్డుపల్లి మహేశ్ ఏకైక కుమారుడు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనను ఆపడం ఎవరి తరం కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Nalgonda, Road accidents, Telangana