తెలంగాణ ఏర్పడ్డాక మూడు సంచలన ఎన్‌కౌంటర్లు...

Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... ఇప్పటికి మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిలో రెండు షాద్‌నగర్‌లోనే జరిగాయి. ఆత్మరక్షణ విషయంలో ఏమాత్రం వెనకాడబోమని పోలీసులు నిరూపిస్తున్నారు.

news18-telugu
Updated: December 6, 2019, 11:17 AM IST
తెలంగాణ ఏర్పడ్డాక మూడు సంచలన ఎన్‌కౌంటర్లు...
తెలంగాణ ఏర్పడ్డాక మూడు ఎన్‌కౌంటర్లు...
  • Share this:
Telangana : ఓ వికారుద్దీన్, ఓ నయీమ్, ఓ దిశా కేసు ఎన్‌కౌంటర్... అన్నింట్లోనూ ఒకటే అంశం ఎన్‌కౌంటర్. ఈ మూడూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినవే. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పటికే వరంగల్‌లో ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్‌ పోలీసుల నిర్బంధంలో ఉంది. 2015 ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదుల్ని కోర్టుకు తీసుకెళ్తుండగా... ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. వికారుద్దీన్‌ను పోలీసులు 2010 జూలై 15న వరంగల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచీ కోర్టుకు తీసుకు వెళ్లే ప్రతిసారీ పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు వికారుద్దీన్ ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అలాంటి వికారుద్దీన్ గ్యాంగ్ 2015లో అంతమైంది. వరంగల్ జైలు నుంచీ హైదరాబాద్ తరలిస్తుండగా జనగామ దాటాక, ఆలేరు మరో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా... కాకతీయ తోరణం దగ్గర టాయిలెట్ కోసం వాహనం ఆపాలని ఉగ్రవాదులు అడిగారు. పోలీసులు ఆపారు. ఆ సమయంలో ఉగ్రవాదులు పోలీసుల నుంచీ తుపాకుల్ని లాక్కునేందుకు ప్రయత్నించారు. ఇతర ఆయుధాలతోను దాడికి పాల్పడి పారిపోయేందుకు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారు చనిపోయారు.

నయీమ్ ఎన్‌కౌంటర్ (2016) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంను కూడా ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనలోనూ సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో సజ్జనార్ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఐజీగా ఉన్నారు. నయీంను హైదరాబాద్ నగర శివారు ప్రాంతం షాద్‌నగర్‌లోనే మిలీనియం టౌన్‌షిప్‍‌లో తలదాచుకున్న విషయం తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులు, గ్రేహౌండ్స్‌పై నయీమ్ కాల్పులకు తెగబడ్డాడు. ఎదురుకాల్పులు జరపడంతో... ఆ ఎన్‌కౌంటర్‌లో అతను చనిపోయాడు. నయీం ఎన్‌కౌంటర్‌తో అనేక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. నక్సలైట్ నుంచీ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్... దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల, బెదిరింపుల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది.

దిశ కేసు ఎన్‌కౌంటర్ (2019) : తాజాగా దిశ కేసులో నిందితులు నలుగురినీ తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ మూడు ఘటనలూ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగాయి. ఐతే... తెలంగాణ ఏర్పడక ముందు... సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌లో 2008లో యాసిడ్ దాడి కేసులో ముగ్గుర్ని ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. అప్పట్లో వరంగల్ ఎస్పీ సజ్జనార్ ఉన్నారు. ఇలా తెలంగాణలో ఎన్‌కౌంటర్లు జోరుగా సాగుతున్నాయి. ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గని పోలీసులు... ప్రాణ రక్షణలో విధులు నిర్వహిస్తూ... ముందుకు సాగుతున్నారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>