అతిగా ఇంటర్నెట్ వాడకం అనార్థాలకు దారి తీస్తుందని పెద్దలు చెబుతున్నా వినిపించుకోకుండా పిల్లలకు ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు అందజేస్తున్న తల్లిదండ్రులకు ఇదొక హెచ్చరిక. ఇన్నాళ్లు గేమ్స్ ఆడుకోవడానికో.. ఏదైనా సినిమా చూడటానికో Youtube (యూట్యూబ్) ను చూసిన పిల్లలు.. ఇప్పుడు అందులో నేరాలను ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అతి ఇంటర్నెట్ వాడకం వారిలో దురాలోచనలను రేపుతున్నది. ఒక బాలుడు యూట్యూబ్ వీడియోలు చూసి హ్యాకింగ్ నేర్చుకోవడమే గాక తన సొంత తండ్రినే బెదిరించి డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం గమనార్హం.
డబ్బులంటే ఏదో చాక్లెట్లు, ఐస్ క్రీంలు కొనుక్కోవడానికో కాదు.. ఆ బాలుడు డిమాండ్ చేసిన నగదు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 10 కోట్లు. ఆ బాలుడి వయసెంతో తెలిస్తే కండ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడికి 11 ఏళ్లు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందీ ఘటన. ఘజియాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి కొద్ది రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తమకు రూ. 10 కోట్లు ఇవ్వాలని లేకుంటే.. మీ కుటుంబంలోని మహిళల నగ్న చిత్రాలు, వారి వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ లో పెట్టేస్తామని ఆ కాల్ సారాంశం. ఇది చూసిన సదరు వ్యక్తి.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
విచారణలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. దర్యాప్తులో భాగంగా బాధితుడి కొడుకును కూడా విచారించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇదంతా చేస్తున్నది తానేనని ఆ బాలుడు ఒప్పుకున్నాడు. ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు.. తరుచూ ఇంటర్నెట్ లో ఏదో చూసేవాడు. యూట్యూబ్ అంటే పడి చచ్చే ఆ విద్యార్థి.. అక్కడే హ్యాకింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. అతడు తన తండ్రి మెయిల్ ఐడీని హ్యాక్ చేసి.. అతడిని తరుచూ వేధించేవాడు. తనకు రూ. 10 కోట్లు డబ్బులు కావాలని డిమాండ్ చేసేవాడు. ఆన్లైన్ లో సైబర్ క్రైం గురించి నేర్చుకున్న ఆ బాలుడు.. హ్యాకింగ్ చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి...? పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఏం చేయాలి..? అనే వీడియోలు ఎక్కువగా చూసేవాడట. ఆ క్రమంలో తన తండ్రి మెయిల్ ఐడీనే హ్యాక్ చేసి.. అతడినే డబ్బుల కోసం వేధించడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, CYBER CRIME, Hacking, Up news, Uttarpradesh, Viral, Youtube