(G.SrinivasaReddy,News18,Khammam)
నరేష్ అనే యువకుడు భద్రాచలం(Bhadrachalam) నుంచి హైదరాబాద్(Hyderabad) బయలుదేరాడు. భద్రాచలం బస్టాండులో(Bustand) బస్సెక్కాడు. పక్కనే మరో పెద్దాయన కూర్చొన్నాడు. బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. డ్రైవర్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఆ పెద్దాయనకు ఓ ఫోన్ వచ్చింది. ఎమర్జెన్సీగా ఇంటికి రమ్మని సారాంశం.. బాబ్బాబు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు.. కొద్దిగా ఈ చేతి సంచి హైదరాబాద్‌లో ఇవ్వు. నువ్వు బస్సు దిగుతూనే మా వాడు వచ్చి తీసుకుంటాడు. నీ ఫోన్ నంబర్ ఇవ్వు తనకు పంపిస్తా. సాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు అంటూ నరేష్ ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆ పెద్దాయన బస్సు దిగి వెళ్లిపోయాడు.
బస్సు నార్కెట్‌పల్లి సమీపంలో ఉండగా పోలీసులు వచ్చి బస్సును తనిఖీ చేశారు. నరేష్ కు ఆ పెద్దాయన అప్పజెప్పిన సంచిలో ఐదు కిలోల గంజాయి దొరికింది. అప్పటిదాకా తన కాళ్ల దగ్గరే పెట్టుకున్న సంచి.. తనది కాదని నరేష్ ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. అరెస్టు చేసి జైలుకు పంపారు.
మరో ఘటనలో..
చత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు వెనుక యాక్సిల్ చుట్టూ గోనె సంచుల్లో నింపిన గంజాయి ప్యాకెట్లను తెలివిగా అమర్చారు. కింద పడుకుని చూస్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. బస్సు డ్రైవర్‌కు తెలీకుండానే గంజాయి మాఫియా అమర్చడంతో బస్సు డ్రైవర్ బలయ్యాడు. ఇలా ఏ నేరం చేయకుండానే అమాయకంగా బలవుతున్న వారెందరో.. రోజురోజుకూ విస్తరిస్తున్న గాంజా మాఫియా అనుసరిస్తున్న వ్యూహాలకు పోలీసులే బేజారైపోతున్న పరిస్థితి ఉంది. విపరీతమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ తమ పనికానిస్తున్న గాంజా మాఫియా దెబ్బకు సామాన్యులు కేసుల పాలవుతున్నారు.
ఒక దగ్గర మొహమాటంతో తెలిసిన వాళ్లనో.. భరోసాతోనో బుక్ అవుతున్న దాఖలాలు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి విజయవాడ, నందిగామ, ఖమ్మం మీదుగా వివిధ పద్దతుల్లో రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఖమ్మం పట్టణంలో ఇద్దరు కానిస్టేబళ్లు, ఓ అడ్వకేట్, మరో స్టూడెంట్, ఇంకో రైతు ఇన్‌వాల్వ్ అయిన గంజాయి రవాణా కేసును స్థానిక పోలీసులు చేధించారు.
వీళ్లు ఏకంగా గాంజా మాఫియాతో రవాణాకు సంబంధించి డాక్యుమెంట్ రూపంలో అగ్రిమెంటు చేసుకోవడం కలకలం రేపింది. నిర్దిష్టమైన కాలానికి ఇంత మొత్తం గంజాయిని సేఫ్‌గా రవాణా చేసినందుకు దఫాల వారీగా ఇచ్చే విధంగా అగ్రిమెంటు చేసుకోవడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా ఈజీ మనీకి ఆశపడి జైలు పాలవుతున్న వారెందరో. ఈ విషయాల్లో ఎవరికి వారే అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉందని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Khammam, Telangana crime news